WhatsApp: అప్పటి వరకు ఒత్తిడి.. ఆంక్షలు ఉండవు.. ప్రైవసీ పాలసీపై కోర్టుకు వివరించిన వాట్సాప్
ప్రేవేట్ పాలసీపై ఒత్తిడి చేయం.. పాలసీని ఆమోదించనివారిపై కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవని ఢిల్లీ హైకోర్టుకు వివరణ ఇచ్చింది వాట్సాప్. తమ కొత్త ప్రైవసీ పాలసీపై విచారణ సందర్భంగా..ఈ వ్యాఖ్యలు చేసింది.
వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తమ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకునే విధంగా యూజర్లపై ఒత్తిడి చేయబోమని కోర్టుకు వివరణ ఇచ్చింది వాట్సాప్. తమ పాలసీని ఆమోదించనివారిపై కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది. కొత్త పాలసీని స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు వాట్సాప్, ఫేస్ బుక్ ల తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు చట్టంగా మారేంత వరకు కొత్త గోప్యతా విధానాలను వినియోగదారులపై బలవంతంగా రుద్దబోమని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రైవసీ పాలసీని చాలా మంది ఆమోదించారని.. అయితే బిల్లు పాసై అందులోని విషయాలు తమకు అనుకూలంగా ఉంటే అప్పుడు ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని చెప్పారు.
ప్రస్తుతానికి వినియోగదారులను ఈ విషయంలో ఇబ్బంది పెట్టడంలేదని, విధానాలకు అంగీకరించని వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే, యూజర్లకు మాత్రం ప్రైవసీ పాలసీకి సంబంధించిన అప్ డేట్ మాత్రం కనిపిస్తూనే ఉంటుందని చెప్పారు. కొత్త ప్రైవసీ పాలసీపై దర్యాప్తు చేయాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించడాన్ని తప్పుపడుతూ వాట్సాప్, ఫేస్ బుక్ లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
అయితే, సంస్థల విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ రెండు సంస్థలు మరో పిటిషన్ వేశాయి. ఆ పిటిషన్ విచారణ సందర్భంగానే వాట్సాప్ ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు భారీ షాకిచ్చింది.
కేంద్రం నిబంధనల్ని పాటించకపోతే చట్టపరమైన రక్షణ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు కొత్త ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్ కూడా వచ్చీరావడంతోనే ట్విట్టర్ ను టార్గెట్ చేశారు. ఈ గడ్డపై ఉండాలంటే ఇక్కడి రూల్స్ పాటించాల్సిందేనని హెచ్చరించారు.