Leopard: వెళ్లినట్టే వెళ్లి మళ్లీ ప్రత్యక్షం.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
కర్ణాటకలోని (Karnataka) చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియకు గ్రామస్థులు, స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. బెళగావితో పాటు సమీపంలోని గ్రామాల్లోనూ...
కర్ణాటకలోని (Karnataka) చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియకు గ్రామస్థులు, స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. బెళగావితో పాటు సమీపంలోని గ్రామాల్లోనూ చిరుత పులి కనిపించడం సంచలనంగా మారింది. గతంలో సంచరించి అదృశ్యమైన పులి.. మళ్లీ తిరిగి రావడంతో గ్రామస్థులు భయంతో వణిపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ (సోమవారం) బెళగావి గోల్ఫ్‌కోర్సు వద్ద రెండుసార్లు కనిపించింది. కాగా.. గతంలో ఈ నెల 5న పులి ఓ కార్మికుడిపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పులిని పట్టుకునేందుకు రంగలోకి దిగారు. ప్రత్యేక బృందాలను నియమించి గాలింపు చేపట్టారు. అయినప్పటికీ పులి ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు మూడు వారాల తర్వాత సోమవారం రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ దృశ్యాలను బస్సు డ్రైవర్లు తమ ఫోన్‌లో రికార్డు చేశారు. వాటిని అధికారులకు పంపించారు. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని 22 స్కూళ్లకు సెలవు ప్రకటించారు. చిరుత పులి రోడ్డు దాటుతున్నప్పుడు తీసిన వీడియో ఆధారంగా పోలీసులు, అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు.. అధికారులు చిరుత కోసం గాలిస్తున్న సమయంలోనే అది మరోసారి రోడ్డు దాటింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన పులి మిలటరీ క్యాంపులోని పొదల వైపు వెళ్లింది. అయితే చిరుతను షూట్ చేసేందుకు తమకు ఆదేశాలు లేవని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే షూట్ చేస్తామని అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..