India Floods: ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. మధ్యప్రదేశ్‌లో 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్..
భారీ వర్షాలకు ఉత్తరాది వణికిపోతోంది. నదులు మహోగ్రరూపం దాల్చాయి. భారీ వరదలకు రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. ఐతే మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.
ఉత్తరాదితో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్, మధ్యప్రదేశ్‌లలో ఎడతెరిపి లేని వానలకు జనజీవనం స్తంభించిపోయింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఉజ్జయిని, జబల్‌పూర్ సహా 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇండోర్, గ్వాలియర్, ధార్, ఖర్గోన్ సహా 12 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు వాతావరణ శాఖాధికారులు. మరోవైపు భారీ వర్షాలకు నదులు మహోగ్రరూపం దాల్చాయి. నర్మదా నదికి వరద పోటెత్తుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేశారు. ఏకధాటిగా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలువులు ప్రకటించారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో జలప్రళయం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. హిమాచల్‌లో వరదలకు 50 మందికి పైగా మృతి చెందారు. మండి జిల్లాలో వరద ఉధృతికి ఇళ్ళు కొట్టుకుపోయాయి. మరో 2 రోజుల పాటు డెహ్రాడూన్ , ముస్సోరి , రుషికేశ్ , హరిద్వార్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
రాజస్థాన్‌లోనూ జోరు వానలు పడుతున్నాయి. రాజధాని జైపూర్ సహా పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. 10 జిల్లాల్లో అతి భారీ, 10 జిల్లాల్లో భారీ వర్షాలు పడ్తాయని వాతావారణ శాఖ తెలిపింది. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఝలావర్, ప్రతాప్ గఢ్, బరన్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెండు రోజులుగా వానలు పడుతుండడంతో కోట బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఒడిషాలో ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు కలహండి నీట మునిగింది. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో నానా అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందని.. దీంతో రోగాల బారినపడుతున్నామని వాపోతున్నారు స్థానికులు. కలహండి-రాయపూర్ మధ్య రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతోనే వరద నీరు పట్టణంలోకి చేరుతోందంటున్నారు.
ఇక జమ్ముకశ్మీర్, జార్ఖండ్‌లలో భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. వాగులూ వంకలూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. కొండచరియలు విరిగిపడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం