Sri Sathyasai District: ఎస్సై మేడమ్.. మీరూ ఒక మహిళేగా.. గోడు చెప్పుకునేందుకు వస్తే ఇలా మాట్లాడొచ్చా
ఆమె ఓ ఎస్సై, కానీ ఆమె నోరు తెరిస్తే అన్నీ బూతులే. అమ్మాయి మిస్సింగ్ అంటూ కంప్లైంట్ ఇస్తే నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఎవడితో పోయిందో ఎవడికి తెలుసు, మీ అమ్మాయి కనిపించపోతే విషం తాగి చావండంటూ ఉచిత సలహా ఇచ్చింది. ఇంతకీ ఆ లేడీ ఎస్సై ఎవరు?
Andhra Pradesh: శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు ఎస్సై వరలక్ష్మి ఓవరాక్షన్‌తో ఓ కుటుంబం అంతులేని ఆవేదన అనుభవిస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదు మేడమ్, అంటూ కంప్లైంట్ ఇస్తే నోటికొచ్చినట్లు తిడుతూ దంపతులను క్షోభకు గురిచేసింది. సాటి మహిళ అని కూడా చూడకుండా దూర్భాషలాడుతూ వేధింపులకు దిగింది నల్లచెరువు ఎస్సై వరలక్ష్మి. నువ్వు ఎవరితో పోయావో, నీ కూతురు ఎవడితో పోయిందో ఎవడికి తెలుసు అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోందని వాపోయింది బాధిత మహిళ. నీ కూతురు కనిపించకపోతే మమ్మల్నేం చేయమంటావ్, వెళ్లి విషం తాగి చావండి అంటూ బెదిరిస్తోందని అంటున్నారు దంపతులు.
తమ అమ్మాయి కనిపించడం లేదని ఆరు నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చినా నల్లచెరువు ఎస్సై వరలక్ష్మి పట్టించుకోవడం లేదంటున్నారు తల్లిదండ్రులు. పైగా పురుగుల మందు తాగి చావండి అంటూ తమకు ఉచిత సలహా ఇస్తోందని వాపోతున్నారు. తమను బెదిరిస్తూ, నిందితులకు వత్తాసు పలుకుతోందని అంటున్నారు బాధితులు. తమ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టేందుకు తామే స్వయంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని, అయినా ఆమె ఎక్కడుందో, ఏమైపోయిందో తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు దంపతులు. నల్లచెరువు ఎస్సై వరలక్ష్మిపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు, బాలిక మిస్సింగ్ ఇష్యూలో ఎస్సై వరలక్ష్మిపై ఆరోపణలు వస్తున్నాయి. పైగా బాధితులతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌ను ఎస్సై తన ఫోన్ నుంచే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదాస్పదమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..