Liquor Mafia Plan: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వికటించిన లిక్కర్ మాఫియా ప్లాన్.. వెయ్యికి పైగా మద్యం బాటిళ్ల సీజ్..
తెలంగాణ నుండి ఏపీకి కారులో తరలిస్తుండగా.. పట్టుకున్నారు. తాడువాయి సమీపంలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు.. ఓ కారులో భారీగా తెలంగాణ మద్యం బాటిళ్లను గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు ఏదో ఒక మార్గం ద్వారా మద్యాన్ని సరిహాద్దులు దాటిస్తూనే ఉన్నారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా, తెలంగాణలో తక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం పోలీసులు ఎక్కడో ఒక చోట పట్టుకుంటున్నా.. కేసులు పెడుతున్నా.. వారిలో మార్పు రావడం లేదు.
పైగా.. పోలీసుల కళ్లుగప్పడానికి మద్యం రవాణాలో కొత్త ఎత్తులకు తెరలేపుతున్నారు. ఎన్ని సార్లు పట్టుకున్నా.. కేసులు పెట్టి మందలించినా.. మీపని మీదే – మా పని మాదే.. అన్న చందంగా మారింది అక్రమార్కుల తీరు. తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో పోలీసులు భారీ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుండి ఏపీకి కారులో తరలిస్తుండగా.. పట్టుకున్నారు. తాడువాయి సమీపంలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు.. ఓ కారులో భారీగా తెలంగాణ మద్యం బాటిళ్లను గుర్తించారు.
వెంటనే కారును సీజ్ చేసి… వెయ్యికి పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న పెదకూరపాడుకు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొచ్చి.. ఏపీలో ఎక్కువ ధరకు విక్రయించి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అక్రమార్కులు.
దీంతో ఏపీకి తరలుతున్న అక్రమ మద్యాన్ని అడ్డుకునేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని… ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తే కఠిన శిక్షలుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు.