DIY drones: డ్రోన్ దాడి అక్కడి నుంచే జరిగింది.. స్పెషల్ ఆపరేషన్స్ మొదలు పెట్టిన భద్రతా దళాలు..
జమ్ము డ్రోన్ ఎటాక్‌పై దర్యాప్తు మరో మలుపు తిరిగింది. ఎయిర్‌బేస్ చుట్టుపక్కల జల్లెడ పడుతున్నారు. ఎటాక్ జరిగిన దగ్గర్లోనే నిందితులు కూడా ఉంటారని అనుమానిస్తున్నారు అధికారులు.
జమ్ముకశ్మీర్ డ్రోన్ ఎటాక్ తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. ఏకంగా ఎయిర్‌బేస్ మీద జరిగిన దాడి కావడంతో.. భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే NIA రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తోంది. డ్రోన్లను ఎక్కడి నుంచి ఎగరేయొచ్చన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. డ్రోన్ ఎటాక్ పక్కా ప్లాన్‌గా భావిస్తున్నారు. ఇందుకోసం ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి భద్రతా బలగాలు. ప్రస్తుతం జమ్ము ఎయిర్‌బేస్ దగ్గర్లో జల్లెడ పడుతున్నారు. ప్రతీరోజు డ్రోన్లు రావడాన్ని చూస్తే.. ముష్కరులు ఎయిర్‌బేస్‌కు దగ్గర్లో ఉండే ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పిజ్జాలు డెలివరీ చేసే డ్రోన్లతో బాంబులను వదిలినట్లు గుర్తించారు. ఇప్పటికే డ్రోన్లను గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగు రోజుల్లో ఏడుకు పైగా డ్రోన్ల సంచారం జరిగింది. డ్రోన్లను దగ్గర్లో ఉండే ఆపరేట్ చేస్తున్నారన్న సమాచారంతో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఎయిర్‌బేస్ చుట్టుపక్కల ఇళ్లలో సెర్చ్ ఆపరేషన్ జరుపుతున్నారు. విమానాశ్రయ ప్రాంతంలోని కాలనీల్లోకి వెళ్లి సెర్చింగ్ జరుపుతున్నారు. ఏ ఇల్లూ వదలకుండా గాలింపు ముమ్మరం చేశారు.
ముఖ్యంగా కొత్తగా అద్దెకి దిగిన వాళ్లకోసం ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పిజ్జా డెలివరీ డ్రోన్లు కాబట్టి రెండు మూడు కిలోమీటర్ల పరిథికి మించి వాటిని ఆపరేట్ చేసే అవకాశం లేదు. రెండు రోజుల్లోనే కార్డన్ సెర్చ్ ముగించి.. నిందితులను అదుపులోకి తీసుకుంటామంటున్నారు భద్రతాధికారులు. జమ్ము ఎయిర్‌పోర్టు దగ్గర్లో ఎన్నో రాడార్ వ్యవస్థలుంటాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో రక్షణ వలయాలుంటాయి. అయినాగాని.. డ్రోన్లు హల్‌చల్ చేయడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా అర్థరాత్రి సమయంలో డ్రోన్ల సంచారం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ డ్రోన్ ఎటాక్ సూత్రధారులను వెంటనే పట్టుకోకపోతే.. ప్రత్యర్థులకు ఇది అలుసుగా మారుతుంది. దేశ భద్రతపైనా ఎన్నో అనుమానాలు పెరుగుతాయి. కాబట్టి భారత దర్యాప్తు సంస్థలకు ఇది సవాల్‌గా మారింది.