AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime: మళ్లీ అదే జరిగితే తలాక్ చెబుతానన్న భర్త.. తీవ్ర మనస్తాపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

Hyderabad Crime: మూడవ కాన్పులో తనకు కొడుకు కాకుండా మళ్లీ బిడ్డ పుడితే తలాక్​చెబుతానని భర్త వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి

Hyderabad Crime: మళ్లీ అదే జరిగితే తలాక్ చెబుతానన్న భర్త.. తీవ్ర మనస్తాపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
Crime
Shiva Prajapati
|

Updated on: Oct 03, 2021 | 4:27 PM

Share

Hyderabad Crime: మూడవ కాన్పులో తనకు కొడుకు కాకుండా మళ్లీ బిడ్డ పుడితే తలాక్​చెబుతానని భర్త వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కామాటిపురా ఇన్‌స్పెక్టర్​ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ముర్గీ చౌక్​ప్రాంతానికి చెందిన ఆమీర్(25 )కు మొయిన్‌పురా ప్రాంతానికి చెందిన రుబీనాబేగం(22)తో మూడున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. అయితే అదనపు కట్నం కావాలని భర్త, అత్త, మామలు రుబీనాను తరచూ వేధిస్తుండేవారు. తొలి కాన్పులో కూతురు పుట్టినప్పటి నుంచి తనకు కొడుకు కావాలని, కూతురు వద్దని భార్య రుబీనా బేగంను అమీర్ శారీరకంగా, మానసికంగా హింసించేవాడు.

అయితే, రెండవ సారి కూడా కూతురు పుట్టడంతో రుబీనా బేగం కు అత్తింట్లో వేధింపు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే రుబీనా మూడోసారి గర్భం దాల్చింది. రుబీనా బేగం రెండునెలల గర్భవతి అని తెలియగానే లింగనిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని, ఒక వేళ ఆడ బిడ్డ అయితే వెంటనే అబార్షన్​చేయించుకోవాలని అమీర్ ఆమెను తీవ్రంగా వేధించాడు. అయితే, లింగ నిర్ధారణ పరీక్షలకు రుబీనా ససేమిరా అనడంతో భర్త రెండు నెలల గర్భవతిగా ఉన్నపుడే పుట్టింటికి వెళ్లగొట్టాడు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతిగా ఉన్న రుబీనా బేగంను అమీర్ సహా అతని కుటుంబ సభ్యులు ఫోన్​లో వేధించడం మొదలు పెట్టారు. ఈ సారి మళ్లీ బిడ్డ పుడితే తలాక్​ (విడాకులు) ఇస్తానని బెదిరంచడంతో రుబీనా బేగం తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యింది.

అంతేగాకుండా పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులు తిరిగి పంపిస్తానని బెదిరించేవారు. అటు అత్తింట్లో ఉన్నా.. ఇటు పుట్టింటికి వచ్చినా వారి వేధింపులు మాత్రం ఆగడం లేదని.. మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలోనే ఇంట్లో తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న రుబీనా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, రుబీనా మధ్యాహ్నం వరకు కూడా బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. డోర్ కొట్టినా తీయకపోవడంతో తలుపులు పగులగొట్టారు. అప్పటికే రుబీనా విగత జీవిగా ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. రుబీనా తల్లిదండ్రులు అది చూసి కన్నీరుమున్నీరయ్యారు. అల్లుడి వేధింపుల కారణంగానే తన కూతురు రుబీనా చనిపోయిందని మృతురాలి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కామాటిపురా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని రుబీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రుబీనా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామాటిపురా పోలీసులు.. రుబీనా భర్త అమీర్‌‌తో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నూర్ మహమ్మద్, టీవీ9 రిపోర్టర్, హైదరాబాద్

Also read:

Love Story: ‘లవ్ స్టోరీ’ సినిమాకు జై కొడుతున్న జనం.. రెండోవారం కూడా తగ్గని జోరు..

iPhone 13: భారతీయుల తలసరి ఆదాయం ఎంతో తెలుసా? ఐఫోన్ తాజా వెర్షన్ కొనాలంటే మనదేశంలో ఎన్ని రోజుల జీతం ఖర్చు చేయాలంటే..

Errabelli Dayakar Rao: తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబరాలు.. వైరల్‌గా మంత్రి ఎర్రబెల్లి కోలాట నృత్యం