Hyderabad ex Mayor: హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయిన మజ్లిస్ నేతలు.. జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్న మాజీ మేయర్..!
హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్.
హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులకు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. మీరెంత నిజాయితీపరులో తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ ఘటన మెహదీపట్నం పరిధిలోని దిల్‌షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. చాలా కాలం నుంచి ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే జిహెచ్ఎంసి అధికారులు స్పందించడం లేదని బిల్డింగ్ కూల్చడానికి ఎలా వస్తారని ఆయన జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు.
వానలు, వరదలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని అధికారులు.. ఇప్పుడెలా అక్రమ కట్టడాలను కూల్చేందుకు వచ్చారని మండిపడ్డారు. ఇంతకుముందు కూడా మాజీద్ హుస్సేన్ ఇలాగే రెచ్చిపోయారు. లెటెస్ట్‌గా మరోసారి అధికారులపై నోరుపారేసుకున్నారు.“ నువ్వు ఎంత నిజాయతీ వాడివో నాకు తెలుసు నాతో పెట్టుకోకు పరిణామాలు మరోలా ఉంటాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో మీ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఇది అబ్బ సొత్తు కాదు” అంటూ జీహెచ్ఎంసీ అధికారులపై ఒంటి కాలుతో లేచారు. అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ వెనక్కి పంపించారు
దిల్‌షాద్ నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మాణం చేపడుతున్నాడు. దీంతో సుమారు 50 మంది పోలీసులతో జీహెచ్ఎంసీ అధికారులు అనుమతి లేని బిల్డింగ్‌ను కూల్చేడానికి రావడంతో మజ్లిస్ నేతలు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు అడ్డుకోవడంతో గొడవ సర్ధుమణిగింది.
Read Also…