Accident: పండుగ పూట విషాదం.. పటాకులు కొనేందుకు వెళ్లి నలుగురు దుర్మరణం..
Accident: బాణాసంచా కాల్చుతూ దీపావళి పండుగని ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే విగతజీవులయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు
Accident: బాణాసంచా కాల్చుతూ దీపావళి పండుగని ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే విగతజీవులయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పండగ పూట ఆ ఇంట్లో విషాధచాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరిని కలిచివేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎర్రపహాడ్ మండల కేంద్రం పరిధిలోని ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాస్.. పండుగకి కూతురు, అల్లుడు ఇంటికి రావడంతో దీపావళి పండగని ఆనందంగా జరుపుకోవాలని భావించాడు. దీంతో పటాకులు, దీపాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు బుధవారం కారులో కామారెడ్డి పట్టణానికి వెళ్లాడు. తనతో పాటు అల్లుడు ఆనంద్ కుమార్, సోదరుడు జగన్‌తో పాటు మరో ఐదుగురు కుటుంబసభ్యులను తీసుకెళ్లాడు. షాపింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే అప్పటికే జోరుగా వర్షం పడుతుంది. ఎర్రపహాడ్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్, అతని అల్లుడు ఆనంద్, సోదరుడు జగన్‌తో పాటు ఐదేళ్ల మనుమడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పండగ పూట ఒకే కుంటుంబంలో నలుగురు మృతిచెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.