Actor Suriya: ఎల్లలు లేని అభిమానం ప్రాణం మీదకు తెచ్చింది.. ఫ్లెక్సీ కడుతూ యువకులు మృతి..
నాదెండ్ల మండలం కట్టుబడిపాలెంకు చెందిన గోపాల్, వెంకటేష్ స్నేహితులు. వీరిద్దరూ వాగ్దేవి కాలేజ్ లో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నారు. వీరికి కృష్ణవేణి కాలేజ్ లో చదివే సాయి తో స్నేహం ఏర్పడింది. సాయి బాపట్ల మండలం నార్నేవారి పాలెం. అయితే ఈరోజు గోపాల్ పుట్టినరోజు.
ఆ హీరో అంటే వాళ్ళకు చచ్చేంత అభిమానం. అతని సినిమాలను చూడటమే కాదు అతని స్టైల్ ను ఫాలో అవుతుండేవారు. అలాంటి వారికి ఆ హీరో పుట్టినరోజు వచ్చిందంటే ఇక చెప్పేదేముంటుంది.. వాళ్ళు స్వంత బర్త్ డే కంటే ఎక్కువ హాడావుడి చేస్తారు. ఆ హాడావుడిలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయరు. అటువంటి దురదృష్టకరమైన ఘటనే పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కట్టుబడి పాలెంలో జరిగింది. నాదెండ్ల మండలం కట్టుబడిపాలెంకు చెందిన గోపాల్, వెంకటేష్ స్నేహితులు. వీరిద్దరూ వాగ్దేవి కాలేజ్ లో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నారు. వీరికి కృష్ణవేణి కాలేజ్ లో చదివే సాయి తో స్నేహం ఏర్పడింది. సాయి బాపట్ల మండలం నార్నేవారి పాలెం. అయితే ఈరోజు గోపాల్ పుట్టినరోజు. అదే రోజు తమిళ సినీ హీరో సూర్య పుట్టిన రోజు కూడా.. దీంతో గోపాల్ ఘనంగా తన పుట్టినరోజు జరుపుకోవడమే కాకుండా తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు కూడా చేయాలని స్నేహితులతో కలిసి నిర్ణయించాడు.
గ్రామానికి చేరుకొని…. దీంతో నిన్న సాయంత్రానికి స్నేహితులంతా గ్రామానికి చేరుకున్నారు. హాస్టల్ లో ఉండే సాయిని కూడా బర్త్ డే పార్టీకి రావాలని చెప్పడంతో కట్టుబడిపాలెం వచ్చేశాడు. రాత్రి పదకొండు గంటల సమయంలో సూర్య ఫ్లెక్స్ గ్రామంలో ఏర్పాటు చేసేందుకు స్నేహితులంతా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫ్లెక్స్ విద్యుత్తు వైర్లకు తగిలింది. దీంతో వెంకటేష్, సాయి అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
సాయి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కాలేజ్ హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులకు చెప్పకుండా హాస్టల్ నుండి ఎలా బయటకు పంపిస్తారంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకు దిగిన వారికి సర్ది చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినీ హీరోపై ఉన్న అభిమానంతో ఇద్దరు ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
టి నాగరాజు, స్పెషల్ కరస్పాండెంట్, టివి9 గుంటూరు.