Omicron variant: ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధనల్లో సంచలనాలు..!
ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
Global Coronavirus Pandemic: ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అయితే, ఒమిక్రాన్ వైరస్ బయటపడి ఇన్ని రోజులు గడుస్తున్నా, స్పష్టమైన లక్షణాలు ఇవి అని ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. తాజాగా ఒమిక్రాన్ లక్షణాలపై కొంత స్పష్టత ఇచ్చింది లండన్ కింగ్స్ కాలేజీ. ఈ కాలేజీ వారు ఒమిక్రాన్‌పై అధ్యయనం చేశారు. అందులో కీలక విషయాలు వెల్లడించారు. గతంలో జ్వరం, దగ్గు, రుచి, వాసన కోల్పోవడం వంటివి కరోనా వేరియంట్ల ప్రధాన లక్షణాలు. కానీ ఇప్పుడు ఒమిక్రాన్‌లో అవి కనిపించడం లేదని అంటున్నారు పరిశోధకులు. కానీ ఈ లక్షణాలు కనిపించినా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్.
వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఒమిక్రాన్ లక్షణాలు చాలావరకు సాధారణ జలుబును పోలి ఉన్నాయని చెబుతున్నారు పరిశోధన జరిపిన ప్రొఫెసర్లు. తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, అలసట, తుమ్ములు లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వాళ్లలో జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. దాంతో ప్రజలు తమకు కోవిడ్ సోకిందని గుర్తించకపోయే ప్రమాదం ఉంది. జలుబు వచ్చి, ఇతర లక్షణాలు కనిపించిన వారు కచ్చితంగా టెస్టులు చేపించుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. కొందరిలో స్వల్ప లక్షణాలే ఉన్నా, నిర్లక్ష్యంగా ఉంటే, ఇతరులకు తొందరగా వ్యాపించే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే, యువతకు ఒమిక్రాన్ ఎక్కువగా సోకుతోందని పరిశోధనలో తేలడం కలకలం రేపుతోంది.
మరోవైపు, అమెరికా, ఆస్ట్రేలియా.. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాలు కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. వీటిలో కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రానున్న నెలల్లో ఇది తీవ్రంగా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఐరోపాలో ఒమిక్రాన్ మెరుపు వేగంతో వ్యాపిస్తోందని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ హెచ్చరించారు. రానున్న నెలల్లో దీని ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. యూకే నుంచి వస్తోన్న ప్రయాణికులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌లో తాజాగా 58,128 మందికి కరోనా వైరస్ ఒమిక్రాన్ బారినపడ్డారని అధికార లెక్కలు చెబుతున్నాయి. జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లో కరోనా వైరస్‌ను అరికట్టే లక్ష్యంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జర్మనీలో నిన్న ఒక్కరోజే 50వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. తాము మున్ముందు ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం కావాలని జర్మనీ ఆరోగ్య మంత్రి అన్నారు. ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్‌లో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో వాటిని రిస్క్ దేశాలుగా జర్మనీ పేర్కొంది.
ఒమిక్రాన్ వేరియంట్‌తో సతమతమవుతున్న బ్రిటన్‌లో మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. నిన్న 93,045 మందికి వైరస్ సోకింది. ఒమిక్రాన్ వేరియంటే తాజా విజృంభణకు మూలమని అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉందని స్కాట్‌లాండ్ ఫస్ట్ మినిస్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. వారం క్రితం తాను హెచ్చరించిన సునామీ ఇప్పుడు మమ్మల్ని తాకడం ప్రారంభించిందన్నారు. ఈ కొత్త వేరియంట్ కట్టడికి ఆ దేశం వ్యాక్సినేషన్ల మీద దృష్టి పెట్టింది. సామూహిక బూస్టర్ కార్యక్రమం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
శీతకాలానికి తోడు పండగ సీజన్ కావడంతో అమెరికాను ఒమిక్రాన్ మరింత కలవరానికి గురి చేస్తోంది. గత జనవరిలో డెల్టా వేరియంట్ అగ్రదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఇప్పుడు ఒమిక్రాన్ ఉద్ధృతి చూపిస్తోంది. తాజాగా అక్కడ 1.7లక్షల మందికి కరోనా సోకిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సెప్టెంబర్ తర్వాత ఇదే భారీ పెరుగుదలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు, కోవిడ్ టీకాలు తీసుకోని వారికి ఈ శీతకాలం తీవ్రంగా ఉండనుందని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు.
అటు, ఆస్ట్రేలియాలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉంది. న్యూ సౌత్ వేల్స్‌లో 2,482, విక్టోరియాలో 1,504, క్వీన్స్‌లాండ్‌లో 31 కేసులొచ్చాయి. మొత్తంగా ఆ దేశంలో 3,820 మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం తమ దేశంలో ఐరోపా, ఉత్తర అమెరికాలోని పరిస్థితి లేదని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. ప్రజలంతా వైరస్‌తో కలిసి జీవించడం అలవాటు చేసుకున్నందున.. తాము ప్రధానంగా ఆసుపత్రిల్లో చేరిక, వెంటిలేటర్లు, ఐసీయూల్లో ఉన్నవారిపైనే దృష్టిపెట్టాల్సి ఉందన్నారు.
Read Also…
Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే
Indian Railways: మహిళలకు రైళ్లలో రిజర్వేషన్‌తో పాటు మెరుగైన సౌకర్యాలు.. రైల్వే శాఖ మంత్రి..