మాస్క్ లేకుండా రోడ్డెక్కితే…షాకే !
కోవిడ్-19 భూతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అయినప్పటికీ చాలా మంది వైరస్ నివారణ చర్యలు పాటించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ లేకుండా రోడ్లపై యద్దేచ్చగా తిరుగుతున్నారు. దీంతో పోలీసులు..

కోవిడ్-19 భూతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. భారత్ సహా అన్ని దేశాలు వైరస్ ధాటికి వణికిపోతున్నాయి. ప్రాణాంతక వైరస్‌ని అంతమొందించేందుకు ఇంతవరకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవటంతో భౌతిక దూరం పాటించటం, ఫేస్ మాస్క్, శానిటైజర్ వాడకంతో కరోనాను నియంత్రించాలని సూచిస్తూ.. ఆయా దేశాలు లాక్‌డౌన్‌తో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వాలు ఎంత చెప్పినా కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లపైకి వస్తే తప్పని సరిగా మాస్క్ ధరించాలనే నిబంధనను గాలికి వదిలేస్తున్నారు. అలాంటి వారికి జరిమానాలు కూడా భారీగానే వడ్డిస్తున్నారు. మనదేశంలోనే కాదు, పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోనూ మాస్క్‌లు పెట్టుకోని వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
పొరుగు దేశం పాకిస్థాన్ లోనూ కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. అయినప్పటికీ చాలా మంది వైరస్ నివారణ చర్యలు పాటించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ లేకుండా రోడ్లపై యద్దేచ్చగా తిరుగుతున్నారు. దీంతో అక్కడి పోలీసులు దారుణ శిక్షలు విధిస్తున్నారు. మాస్క్ లేకుండా కనిపించిన వారికి కరెంటు షాకులు ఇస్తున్నారు. టేజర్ గన్లతో స్వల్పస్థాయిలో కరెంటు షాక్ పెడుతున్నారు. బటన్ నొక్కితే కరెంట్ శరీరంలోకి వెళ్తుంది. ఆ షాకుల వల్ల ప్రాణాపాయం ఉండదని, అయితే గుండెజబ్బులు, ఇతర తీవ్ర వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి దుర్మర్గాలు మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయంటున్నారు హక్కుల సంఘం నేతలు. పోలీసులు అమలు చేస్తున్న చర్యలను వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.
