Covid-19: నేను సైతం అంటూ… కరోనా రోగుల సేవలో సినిమా నటులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఎందరో సామాజిక సేవకులు, యువకులు కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు సహాయంగా ఉంటున్నారు.

Covid-19: నేను సైతం అంటూ... కరోనా రోగుల సేవలో సినిమా నటులు
Chiranjeevi and Sonu Sood
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 12, 2021 | 11:10 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఎందరో సామాజిక సేవకులు, యువకులు కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు సహాయంగా ఉంటున్నారు. వారితోపాటు కొందరు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు కూడా కొవిడ్‌ బాధితులకు తమ స్థాయిలో చేయూతనందిస్తున్నారు. సామాజిక సేవ చేయాలనే సంకల్పం బలంగా ఉంటే… సాయం తప్పక చేయగలమని ఎందరో నిరూపించారు.

సహాయానికి ముందుకొస్తున్న సినీ నటులు ఎందరో… సోనూసూద్, అక్షయ్ కుమార్‌, తాప్సీ, స్వరా భాస్కర్, భూమి పెడ్నేకర్, సోనాల్ చౌహాన్ సహా పలువురు సినీ తారలు అడవి శేష్, సందీప్ కిషన్, సప్తగిరి లాంటి నటులు ప్రజలకు సాయం అందిస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు.

సోనూసూద్.. కరోనా కష్టకాలంలో బాగా వినిపించిన పేరు ఇది. కరోనా కష్టాల సమయంలో సోనూసూద్‌ చేసిన, చేస్తున్న సహాయాల గురించి చెప్పాలంటే సినిమా స్క్రిప్టు కంటే ఎక్కువే అవుతుంది. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు సోనూసూద్. తాజాగా… దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు నెలకొల్పేందుకు  సోనూసూద్‌ సిద్ధమయ్యారు. ఫ్రాన్స్‌ సహా ఇతర దేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 10 రోజుల్లో ఫ్రాన్స్‌ నుంచి తొలి ప్లాంట్ రానుందని ఇప్పటికే వెల్లడించారు.

కిందటి ఏడాదిలో లాక్ డౌన్ వల్ల వేలాది మంది కార్మికులు గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న సమయంలో వారిపాలిట దేవుడు అయ్యాడు.  బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు.అంతటితో సోను సాయం ఆగిపోలేదు..రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ నలుమూలల నుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు.  ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు.

తాజాగా సోనూ సూద్ చేసిన సాయం వల్ల బెంగళూరులో 22 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఎంతో మందికి సోను స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ప్రశంసించారు. సినీ నటుడు సోనూసూద్ ప్రభుత్వం కంటే వేగంగా పని చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రముఖులు కూడా సోనూ సూద్ నుండి సాయం పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో క్రికెటర్ రైనా తన ఆంటీకి ఆక్సీజన్ సిలిండర్ అవసరం అంటూ పోస్ట్ పెట్టగానే ఆమెకు ఆక్సిజన్ సిలిండర్ అందించాడు సోనూసూద్. మరో క్రికెటర్ హర్భజన్ సింగ్ కు ఆ రకమైన సాయమే చేశాడు.

అటు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్‏ కూడా సోనూను హెల్ప్ కావాలంటూ వేడుకున్నాడు. వెంకట రమణ అనే పేషంట్ కు మందులు, అత్యవసర కిట్ అవసరం అంటూ మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా సోనూను అభ్యర్థించాడు. దీంతో వెంటనే స్పందించిన సోనూసూద్..మెహర్ రమేష్ అడిగిన మందులు మరియు ఇతర అవసరాలకు సంబంధించిన పరికరాలను కేవలం 24 గంటల లోపులో సమకూర్చాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన కైలాశ్‌ అగర్వాల్‌ 10 రోజుల క్రితం కోవిడ్‌ బారిన పడ్డారు. ఆక్సిజన్‌ శాచురేషన్‌ 60–70 మధ్యలో ఉండటంతో బంధువులు ఆస్పత్రుల్లో చేర్చేందుకు యత్నించగా ఎక్కడా బెడ్లు ఖాళీ లేవు. గ్రామస్తులు ఈ విషయాన్ని ట్విట్టర్‌లో సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సోనూసూద్‌ కైలాశ్‌ను ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి, అక్కడి ఉంచీ అపోలో అసుపత్రికి చేర్చి సాయం చేశారు. సోనూసూద్‌ వారం క్రితం కూడా ఝాన్సీ నుంచి ఇద్దరు కరోనా రోగులను హైదరాబాద్‌కు తరలించి సాయం చేశారు. కరోనా సోకినవారి ప్రాణాలను కాపాడగలిగితే అది 100 కోట్ల సినిమా చేయడం కంటే కొన్ని లక్షలరెట్లు ఎక్కువ సంతృనిస్తుందని సోనూసూద్‌ అన్నారు. రోజుకు వేలాది మంది తనను సాయం కోసం ఆశ్రయిస్తున్నారని, సాయం కోసం మొన్న శనివారం ఒక్కరోజే తనకు 41 వేల 660 రిక్వెస్ట్స్ వచ్చాయని సోనూ భాయ్ వెల్లడించారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్… క‌రోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి సాధ్యమైనంత వ‌ర‌కు సాయం అందిస్తున్నానని తెలిపిన బిగ్ బీ చేసిన సాయం చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదన్నారు. తన వ్యక్తిగత నిధి నుంచి కరోనా ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ కు మాస్క్ లు, పీపీఈ కిట్లు అందించానని చెప్పారు. విదేశాల నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు తెప్పించి ఢిల్లీ, ముంబైలో ఆస్ప‌త్రులకు ఇచ్చాన‌ని తెలిపారు. ఢిల్లీ గురుద్వారాలో 250 నుంచి 450 పడకల కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలోని కోవిడ్‌ కేర్‌సెంటర్‌కు ఆయన 2 కోట్ల విరాళం అందజేశారు. తన తాత, నాన్నమ్మ, తల్లి పేరిట ఖరీదైన ఎంఆర్‌ఐ యంత్రం, సోనోగ్రాఫిక్, స్కానింగ్‌ పరికరాలు అందజేశానని వివ‌రించారు. తాను కోవిడ్ సాయంగా దాదాపు రూ.15 కోట్ల మేర అందించినట్లు బిగ్ బీ తెలిపారు.  చాలామంది ఏం తెలియ‌కుండా సోష‌ల్ మీడియాలో సినిమావాళ్ల‌ను తిడుతున్నార‌ని…అందుకే స్పందించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు అమితాబ్‌.

Amitabh Bachan

Amitabh Bachan

సల్మాన్‌ఖాన్‌ సాయం.. “భాయీ జాన్జ్‌ కిచెన్‌” రెస్టారెంట్‌ ద్వారా పోలీసులకు, ఆరోగ్య కార్యకర్తలకు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ఉన్నవారికి సల్మాన్ ఖాన్ ఆహారం అందిస్తున్నారు. బీయింగ్‌ హంగ్రీ పేరుతో ఉన్న వ్యాన్ల ద్వారా ముంబయి అంతటా అవసరమైన వాల్లకు ఆహారం సరఫరా చేస్తున్నారు. ఈ పార్శిల్ లో భోజనం, బిస్కెట్లు, వాటర్‌ బాటిల్‌తో పాటు చికెన్‌ నగ్గెట్స్‌, చికెన్‌ బిర్యానీ, వెజ్‌ బిర్యానీ, విటమిన్‌ సి అధికంగా ఉండే జ్యూస్‌లు అందింస్తున్నారు. రోజుకు 5,000 మందికి ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్న పనిచేస్తున్నారు సల్మాన్‌ఖాన్‌. ఇటీవల కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి కరోనా కారణంగా తన తండ్రిని కోల్పోయాడు.ఈ నేపథ్యంలో తన చదువుకు తన ఇంట్లో అవసరాలకు సహాయపడమని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ విషయం సల్మాన్ టీమ్ దృష్టికి వెళ్లడంతో అప్పటికప్పుడు సదరు విద్యార్థిని కలుసుకొని ఆయనకి ఆర్థిక సాయం అందించడమే కాక ఆయన సెటిల్ అయ్యేదాకా సల్మాన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు

నటి అలియా భట్… తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో కోవిడ్ -19 రోగులు .. వారి కుటుంబాల అవసరమైనవారికి సహాయం అందిస్తానని ప్రకటించారు. జర్నలిస్ట్ ఫయే డిసౌజాతో కలిసి బాధితులకు సేవలు అందించేందుకు ఆలియాభట్‌ పనిచేస్తున్నారు.

కంగనా రనౌత్‌… ఎంతోమందికి ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులు, వ్యాక్సిన్‌లు, ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేయించినట్లు  కంగనా రనౌత్ తెలిపింది.

హీరో సందీప్ కిషన్… యంగ్ హీరో సందీప్ కిషన్ తన బర్త్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు కరోనా వలన పెద్ద వాళ్లు చనిపోతే వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. అలాంటి వారిని రెండేళ్లే పాటు తాను చూసుకుంటానని కొద్ది రోజుల క్రితం సందీప్ అనౌన్స్ చేసిన సందీప్‌ కిషన్‌

సప్తగిరి… హీరో, కమెడియన్ సప్తగిరి కూడా ఆపదలో ఉన్న ఓ దర్శకుడికి అండగా నిలిచాడు. నంద్యాల రవి అనే దర్శకుడు ఇటీవల కరోనా బారిన పడ్డాడు. కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యంతో పాదపడుతున్న ఆయన హాస్పటల్ లో చికిత్సపొందుతున్నారు. అయితే హాస్పటల్ బిల్లు 7 లక్షల వరకు అయ్యిందని తెలుస్తుంది. దర్శకుడి కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని భరించే శక్తి లేకపోవడంతో నటుడు సప్తగిరి పెద్ద మనసుతో ముందుకు వచ్చి లక్షరూపాయలు ఆర్ధిక సాయం అందించాడని సమాచారం. అంతే కాదు గతంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కు సప్తగిరి 2 లక్షల రూపాయలు సాయం అందించిన విషయం తెలిసిందే.

నిఖిల్‌… తెలుగు యువ హీరో నిఖిల్‌ తన స్నేహితులతో కలిసి ట్విటర్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా సాయం అందిస్తున్నారు. మందులు, ఇంజెక్షన్స్‌, అసుపత్రిలో పడకలు, ఆక్సిజన్‌, ఇలా ఎన్నో రకాలుగా సాయం చేస్తున్నా సరిపోవడం లేదని తెలిపారు. ఈ సమయంలో అందరం కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఈ కల్లోలం నుంచీ బయటపడాలని నిఖిల్ కోరారు.

అర్జున్ గౌడ… కన్నడ హీరో అర్జున్ గౌడ ఏకంగా అంబులెన్స్ డ్రైవర్​గా మారి బాధితులకు సాయం చేస్తున్నాడు. ఇటీవల ఓ ఫొటోను అతడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్​గా మారింది. ‘‘అంత్యక్రియలు జరిపేందుకు సాయం కోసం చూస్తున్న వారికి అండగా నిలిచా..వారు ఎక్కడి నుంచి వచ్చారు? వారిది ఏ మతం? ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం…నేను అన్ని జాగ్రత్తలతో పాటు శిక్షణను తీసుకున్నా… మీ ప్రేమకు, విషెస్​కు కృతజ్ఞతలు. కర్ణాటక ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నా” అని అర్జున గౌడ చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో కొంత మంది సినీ ప్రముఖులు కొవిడ్‌ రోగుల కోసం తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. మరికొంత మంది సిటిజన్స్‌ రెస్పాన్స్‌ పేరుతో సోషల్‌ మీడియా వేదికను ఏర్పాటు చేసి..వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ వివరాలు, ఆస్పత్రులు, ఆరోగ్య సేవల సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ గ్రూపులో ప్రముఖ సినీ నటులు ఉన్నారు. కోల్‌కతాకు సమీపంలోని పాతూలి ప్రాంతంలో 5 పడకలతో కొవిడ్‌ రిలీఫ్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు

మెగాస్టార్ చిరంజీవి… కరోనాతో ఇటీవల మరణించిన తెలుగు సినిమా నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ కుటుంబానికి లక్ష రూపాయాల సాయం అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా తనవంతుగా రూ. 50వేలను టీఎన్ఆర్ భార్యకు అందజేశారు.

గతంలో… గత సంవత్సరం కరోనా మొదటి దశలో కూడా అనేక మంది సినీ ప్రముఖలు తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్.. సినిమా వాళ్లలో ఎవరికి అందనంత ఎక్కువగా రూ.25 కోట్ల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్.. హిందీ చలన చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు తన వంతుగా 25వేల మంది సినీ కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. గాన కోకిల లతా మంగేష్కర్ తన వంతుగా రూ.25 లక్షల విరాళాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.

మరోవైపు సీనీయర్ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాదు పీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో రూ.50 లక్షల, మొత్తంగా రూ. కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. అటు హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్, సారా అలీ ఖాన్ పీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు సాయం ప్రకటించారు. భర్త విరాట్ కోహ్లీతో కలిసి కోవిడ్ సాయంగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ…మొత్తం రూ.7 కోట్ల విరాళాలు సమీకరించనున్నట్లు ప్రకటించారు.

గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా 4 లక్షల మంది కూలీలకు నెల రోజులపాటు ఆహారం అందజేసిన అమితాబ్‌ బచ్చన్‌..వలస కార్మికులు వారి సొంతూళ్లకు తిరిగి వెళ్లేందుకు సహకారం అందించారు.

గతంలో తెలుగు సినీ హీరోలు… కరోనా లాక్‌డౌన్‌లో రోజువారీ వేతనానికి పనిచేసే సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటుచేశారు. సినీ పరిశ్రమ నుంచి స్టార్ హీరోల నుంచి చాలా మంది నటులు, దర్శకులు ఈ చారిటీకి విరాళం ఇచ్చారు. ఈ నిధులతో కొన్ని వేల మంది కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు.

ఇది కూడా చదవండి…క‌రోనాతో టాలీవుడ్ లో మ‌రో విషాదం.. ద‌ర్శ‌కుడు విన‌య్ కుమార్ క‌న్నుమూత‌

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. కేవలం ఐదు గంటల్లోనే రూ. 20 కోట్ల అమ్మకాలు.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..