APPSC: గ్రూపు-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

గత జూన్‌లో ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌లో ఎక్కువమంది సభ్యులు ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పట్టుబట్టారు.

APPSC: గ్రూపు-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
Appsc
Follow us

|

Updated on: Oct 01, 2022 | 7:20 AM

గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్దరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు సరైన అభ్యర్థుల ఎంపిక కోసం ఇంటర్వ్యూ‌లు పెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడంలో పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా పారదర్శకత కోసమే మళ్లీ ఇంటర్వ్యూలను నిర్వహించాలని నిర్ణయించింది. గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోని కొంతమంది సభ్యుల ఒత్తిళ్ల మేరకు ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంటర్వ్యూలను రద్దు చేయడం వల్ల నియామక ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని, అలాగే అభ్యర్థులపై ప్రెజర్ తగ్గేందుకు ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, కొందరు అభ్యర్థులు వారికి ఉన్న పలుకుబడితో గ్రూప్ 1లో నిర్వహించే ఇంటర్వ్యూల్లో అందరి కంటే ఎక్కువ మార్కులు పొందేవారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాంటి సమయంలోనే ప్రభుత్వం గ్రూప్ 1లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, నిరుద్యోగులకు ఊరట కలిగించింది. అయితే, తాజాగా ఆ నిర్ణయంపై వెనకడుగు వేయడంతో విమర్శలు మొదలయ్యాయి. తాజాగా వెల్లడించిన ఉత్తర్వులు లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఉద్యోగాలకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గత జూన్‌లో ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌లో ఎక్కువమంది సభ్యులు ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇదే విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనని కమిటీ నివేదిక ఇవ్వడంతో.. గ్రూపు-1లో కీలక పోస్టులకు ఇంటర్వ్యూలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.