TG TET 2024 Exams: మరికాసేపట్లో టెట్ పరీక్షలు ప్రారంభం..15 నిమిషాలకు ముందే గేట్లు క్లోజ్
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) పరీక్షలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 92 పరీక్ష కేంద్రాల్లో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 2,75,753 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి..
హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి టెట్‌కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో పేపర్ 1కు 94,327 మంది, పేపర్ 2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. టెట్ కోసం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 12.30 గంటల నుంచి లోనికి అనుమతిస్తారు. ఇక పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను క్లోజ్ చేయనున్నారు. ఉదయం సెషన్‌లో ఉదయం 8.45 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 1.45 గంటలకు గేట్లను క్లోజ్ చేస్తారు. గేట్లు క్లోజ్ కాకముందే అభ్యర్ధులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్ధులకు ఏవైనా సమస్యలు ఎదురైతే 7032901383, 9000756178, 7075088812, 7075028881, 7075028882, 7075028885 నంబర్లను సంప్రదించాలని టెట్ ఛైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి సూచించారు.
మరోవైపు ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ పూర్తి చేసిన రేవంత్ సర్కార్.. రెండోసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. గతంలో ఇచ్చిన జాబ్ క్యాలిండర్ ప్రకారం.. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత ఏడాది మెగా డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 17 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో టీచర్ ఉద్యోగార్థులు టెట్ ద్వారా స్కోర్ పెంచుకుని, డీఎస్సీ సాధించాలని యోచిస్తున్నారు.
డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అందుకే కొంతమంది స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ మళ్లీ టెట్ రాస్తూనే ఉన్నారు. టెట్ అర్హత లేనివారు మాత్రం ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అర్హత సాధించాలని కష్టపడుతున్నారు. మరోవైపు అభ్యర్ధులు టెట్, డీఎస్సీ కలిపి కోచింగ్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా టెట్, డీఎస్సీ కోసమే ఏకంగా 418 కోచింగ్ కేంద్రాలు వెలిశాయంటే ఈ పోస్టులకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.