Telangana: త్వరలోనే ఆ శాఖలో పోస్టుల భర్తీ.. నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశాలు..
పంచాయతీ రాజ్ శాఖలో అవసరమైన పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ మంత్రి దయాకర్ రావు అన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ శాఖకు...
పంచాయతీ రాజ్ శాఖలో అవసరమైన పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ మంత్రి దయాకర్ రావు అన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రామ రహదారులను అందంగా, గుంతలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్న ఆయన.. అందుకు తగ్గట్టుగా పని చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మండలాలు, గ్రామ పంచాయతీలతో కొత్త సర్కిల్స్, డివిజన్ల వారీగా వేయాల్సిన రోడ్లు, అవసరమైన సిబ్బంది కోసం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. రేపు (గురువారం) సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇంజినీర్స్ వర్క్‌షాప్‌లో చర్చించిన రోడ్లకు తక్షణ మరమ్మతులు, నిర్వహణ ప్రతిపాదనలపై వివరాలు ఆరా తీశారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అత్యవసరమైన పనుల జాబితాను రూపొందించాలని మంత్రి సూచించారు.
వచ్చే నెల 10 నాటికి రోడ్ల మరమ్మతులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేయాలి. ఈ నెల 30 లోగా మంజూరు తీసుకోవాలి. డిసెంబర్ 15 లోగా పనులు ప్రారంభించాలి. వరద నీటితో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 67వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వీటిని అద్దంలా ఉండేలా చూడాలి. శాఖ పునర్వ్యవస్థీకరణకు అవసరమైతే మరో రూ.100కోట్లు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు.
– దయాకర్, తెలంగాణ మంత్రి
కాగా.. కొద్ది రోజుల క్రితం టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే టీచర్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో పీఆర్‌టీయూఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి.. హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని.. వీటికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు వివరించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..