Convener Quota: ఇంజనీరింగ్ కన్వీనర్ సీట్లపై సర్కార్ క్లారిటీ.. 15% నాన్‌లోకల్ కోటా రద్దు..!
తెలంగాణలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకే సీట్లన్నీ దక్కనున్నాయి. గత పదేళ్లుగా అమలవుతున్న 15 శాతం అన్ రిజర్వుడ్ కోటా కింద లబ్ధి పొందుతున్న ఏపీ విద్యార్ధులకు ఇకపై తెలంగాణ విద్యా సంస్థల్లో చదువుకునే ఛాన్స్ పూర్తిగా రద్దైంది..

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ విద్యార్థులకే సీట్లన్నీ దక్కనున్నాయి. గత పదేళ్లుగా అమలవుతున్న 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు 15 శాతం నాన్ లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు 15 శాతం కోటా కింద ఏపీతో పాటు తెలంగాణ స్థానికులూ పోటీ పడేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 2024తో పదేళ్లు పూర్తయిన పూర్తవడంతో.. ఈ 15 శాతం కోటా గడువు ముగిసినట్లైంది. నిజానికి, గత విద్యా సంవత్సరం నుంచే 15 శాతం కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల రిత్య నాన్ లోకల్ కోటాను అమలు చేశారు. ఈ మేరకు ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్స్ గైడ్‌లైన్స్‌లో సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
15 శాతం సీట్లకు ఎవరు అర్హులంటే..
తాజా సవరణల మేరకు కన్వీనర్ కోటాలో 85 శాతం శాతం సీట్లు తెలంగాణ స్థానికులకు, 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కోటా కింద భర్తీ చేస్తారు. అయితే అన్ రిజర్వ్‌డ్ కోటాలో తెలంగాణ స్థానికులు, తెలంగాణలో కనీసం 10 సంవత్సరాలు నివాసం ఉన్నవారికి మాత్రమే సీట్లు లభిస్తాయి. అన్ రిజర్వ్‌డ్ కోటా 15 శాతం సీట్లు ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వర్తించేది. ఇకపై కేవలం తెలంగాణకు మాత్రమే వర్తిస్తుంది. 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కోటాలో.. తెలంగాణ స్థానికులతోపాటు 10 సంవత్సరాలు తెలంగాణలో నివాసం ఉన్న వారు, రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి పిల్లలు పోటీపడే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారి జీవిత భాగ స్వాములు ఉంటే వారి పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీకి ఇకపై నో ఛాన్స్. ఈ సవరించిన నిబంధనలు ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మా, బిజినెస్ అడ్మిని్రస్టేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తాయి. తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు (నాలుగేళ్లు) విద్యాభ్యాసం చేసిన విద్యార్థులను కూడా స్థానికులుగానే గుర్తిస్తారు.
రాష్ట్రంలో ప్రస్తుతమున్న అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే స్థానికత కిందకు వస్తాయని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లభించలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల మేరకే ప్రస్తుతం జీవో ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రపతి ఆమోదం లేకుండా జీవో ఇవ్వడం సరికాదని, దీనివల్ల న్యాయపరమైన సమస్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. తాజా సవరణల వల్ల నాన్ లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులు ఏటా దాదాపు 60 వేలకుపైగా కన్వీనర్ సీట్లు పొందుతున్నారు. వీరికి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇలా సీట్లు పొందే అవకాశం ఉండదు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




