మగ పోలీసులకు మేకప్ క్లాసులు.. బ్యూటీ టిప్స్! అద్దం ముందు కూర్చుని తెగ సింగారించుకుంటున్న ఖాకీలు
పోలీసులను చూడగానే.. బుర్ర మీసాలు, గుర్రుమనే చూపు, గంభీరమైన కంఠం.. కళ్లముందు మెదులుతాయి. కర్ణకఠోరమైన మాటతీరు సామాన్యులను హడలెత్తిస్తాయి. అందుకే కాబోలు.. జపాన్‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా.. మగ పోలీసు క్యాడెట్లు మేకప్ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. అంతేనా గంటల తరబడి అద్దం ముందు కూర్చుని తెగ సింగారించుకుంటున్నారు..

జపాన్‌లోని ఫుకుషిమా పోలీస్ అకాడమీ ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 60 మంది క్యాడెట్‌లకు ప్రొఫెషనల్ అపియరెన్స్ కోసం మేకప్ తరగతులను నిర్వహిస్తుంది. ఈ శిక్షణలో భాగంగా మేకప్ వేసుకోవడం, చర్మ సంరక్షణ, వస్త్రధారణ వంటి అంశాలను పోలీసులకు బోధిస్తారన్నమాట. అంతేకాడు ప్రముఖ కాస్మటిక్ కంపెనీ షిసిడో కూడా వీరి శిక్షణలో పాల్గొంటున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.
ఈ ట్రైనింగ్‌లో మగ పోలీసులకు కనుబొమ్మలకు పెన్సిల్స్ వినియోగం, మాయిశ్చరైజింగ్, ప్రైమర్‌లను అప్లై చేయడం వంటి ప్రాథమిక మేకప్ టిప్స్ నేర్పిస్తారట. క్యాడెట్‌లు ఐబ్రోస్ చేయడం, హెయిర్‌స్టైలింగ్ వంటి గ్రూమింగ్ నైపుణ్యాలను కూడా నేర్చుకుంటున్నారు. ఈ కోర్సులో నాణ్యమైన ప్రమాణాల కోసం జపనీస్ కాస్మెటిక్స్ బ్రాండ్ షిసిడోను తీసుకువచ్చి బ్యూటీ పాఠాలు నేర్పిస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యే అధికారులు చూసేందుకు చక్కగా, ప్రొఫెనల్‌గా కనిపించేందుకు మగ పోలీసులకు శిక్షణ ఇస్తున్నట్లు పోలీస్ అకాడమీ వైస్-ప్రిన్సిపాల్ తకేషి సుగియురా మీడియాకు తెలిపారు.
ఇక ఈ ట్రైనింగ్‌లో పాల్గొంటున్న మగ పోలీసులు కూడా ఎంతో ఆసక్తిగా బ్యూటీ పాఠాలు నేర్చుకుంటున్నారట. గతంలో ఎప్పుడూ మేకప్ వేసుకోలేదు. పోలీసు అధికారిగా ఉండటం అంటే ప్రజల దృష్టిని ఆకర్షించడం. అప్పుడే వారికి నమ్మకం కుదురుతుంది. కాబట్టి డ్యూటీకి వెళ్లే ముందు ఎదుటి వారికి చక్కగా కనిపించేలా రెడీ అవుతామని ఉత్సహంగా చెబుతున్నారు. ఇక పోలీసులకు చెబుతున్న ఈ బ్యూటీ పాఠాలు కాస్తా జపనీస్ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చిస్తున్నారు. మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. దొంగలను పట్టుకోవడానికి చూపులతోనే గేలం వేయవచ్చని.. కొందరు యూజర్లు ఈ ట్రైనింగ్‌పై జోకులు పేలుస్తుంటే.. మరికొందరేమో పోలీస్ అకాడమీ ఐడియాను సమర్థిస్తున్నారు.
సాధారణంగా జపాన్‌లోని పోలీస్ అకాడమీలు శారీరక, చట్టపరమైన శిక్షణపై దృష్టి పెడుతుంటాయి. అయితే గ్రూమింగ్-సంబంధిత కోర్సులను ప్రవేశపెట్టడం ఆసక్తిగా మారింది. ఫుకుషిమాలోని అకాడమీతో పాటు, యమగుచిలోని మరొక పోలీస్ అకాడమీ కూడా ఇలాంటి బ్యూటీ క్లాస్‌లను నిర్వహిస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.