విమానాలు, ప్యాసింజర్లు లేని సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రం.. ఎక్కడుందో తెలుసా?
తీవ్ర చర్చనీయాంశమైన కొత్త విమానాశ్రయం మన పొరుగు దేశం పాకిస్తాన్‌లోనే ఉంది. ఆ దేశంలోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న సముద్ర తీర పట్టణం గ్వాదర్‌లో ఈ విమానాశ్రయాన్ని అత్యాధునిక హంగులతో 240 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా చైనా ఆర్థిక సహాయం చేసింది. ఏడాదికి 4 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ.. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ఒక్క విమాన సర్వీసు కూడా ప్రారంభం కాలేదు.

అదొక అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంకా చెప్పాలంటే 4,300 ఎకరాల్లో విస్తరించిన ఆ విమానాశ్రయం.. విస్తీర్ణంలో ఆ దేశంలోకెల్లా అతి పెద్దది. దీన్ని అత్యంత ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా నిర్మించారు. 2024 అక్టోబర్ నాటికే నిర్మాణం పూర్తయి కార్యాకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. కానీ ఇప్పటి వరకు ఒక్క విమానం కూడా అక్కడ నుంచి టేకాఫ్ కాలేదు. సాధారణంగా తొలుత దేశీయ ప్రయాణాల కోసం చిన్న విమానాశ్రయం నిర్మించి, తర్వాతి కాలంలో పెరిగే రద్దీని బట్టి విస్తరించుకంటూ వెళ్తారు. ఒకవేళ ఆ పట్టణం లేదా నగరం నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని గుర్తిస్తే.. అప్పుడు దాన్ని మరింత విస్తరించి, అధునాతన సౌకర్యాలు కల్పించి అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విమానాశ్రయం అలా కాదు. ఏకంగా నిర్మాణమే అంతర్జాతీయ ప్రయాణాల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుపుకుంది. కానీ విమాన సర్వీసులే ప్రారంభం కాకపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఆ విమానాశ్రయం ఎక్కడుందంటే?
ఇంత చర్చనీయాంశమైన విమానాశ్రయం మరెక్కడో లేదు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లోనే ఉంది. ఆ దేశంలోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న సముద్ర తీర పట్టణం గ్వాదర్‌లో ఈ విమానాశ్రయాన్ని అత్యాధునిక హంగులతో 240 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా చైనా ఆర్థిక సహాయం చేసింది. ఏడాదికి 4 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ.. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ఒక్క విమాన సర్వీసు కూడా ప్రారంభం కాలేదు. ఈ ఏడాది జనవరి 20న అధికారికంగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన PK 503 విమానంలో ఆ దేశ ఉన్నతాధికారులు ఈ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. నిర్మాణం పూర్తయి, కార్యాకలాపాలు కూడా ప్రారంభించినప్పటికీ.. విమానయాన సంస్థలు ఒక్కటి కూడా తమ విమాన సర్వీసులను ప్రకటించేందుకు ముందుకు రావడం లేదు. కనీసం గ్వాదర్ నుంచి బెలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా లేదా తమ దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు అనుసంధించే సర్వీసులు లేవు.

Gwadar Airport
ఇదేంటని స్థానిక ప్రజలను ప్రశ్నిస్తే.. “ఈ విమానాశ్రయం పాకిస్తాన్ కోసమో.. లేక గ్వాదర్ పట్టణం కోసమో కాదు. ఇది పూర్తిగా చైనా కోసం, చైనా పౌరుల కోసం నిర్మించుకున్నది” అంటూ సమాధానం ఎదురవుతోంది. కనీసం విమానాశ్రయ నిర్మాణ పనుల్లో సైతం స్థానికులకు ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదని ఆరోపిస్తున్నారు. కనీసం వాచ్‌మన్‌గా కూడా తమను పరిగణించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఈ విమానాశ్రయాన్ని “చైనా – పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (CPEC)”లో భాగంగా నిర్మించారు. చైనాలోని షింజియాంగ్ ప్రావిన్సును అరేబియా సముద్రంతో అనుసంధానించడం కోసం బృహత్తర ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా గ్వాదర్ వరకు భారీ హైవే, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులతో పాటు గ్వాదర్ పోర్టులో కూడా చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నప్పటికీ.. చైనా పూర్తిగా తన సొంత అవసరాలకు వినియోగించుకునేలా దీన్ని డిజైన్ చేసుకుంది అనుకోవచ్చు.
బెలూచిస్తాన్ భయం
ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తూ వేర్పాటువాద తిరుగుబాటుదారుల హింసాత్మక చర్యలతో అట్టుడికిపోతున్న బెలూచిస్తాన్ మీదుగా రోడ్డు ప్రయాణం కంటే నేరుగా గ్వాదర్ పోర్టుకు విమానంలో వెళ్లడం సురక్షితమని చైనా భావిస్తోంది. ఎందుకంటే బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సాయుధ బలగాలతో పాటు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న చైనా ఇంజనీర్లు, సిబ్బందిని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డ ఉదంతాలు చాలా ఉన్నాయి. చైనా ఇంజనీర్లు, హై-ర్యాంక్ అధికారుల భద్రత కోసం పాకిస్తాన్ పెద్దమొత్తంలో సాయుధ బలగాలను ఈ ప్రాంతంలో మొహరించింది. వారు రహదారులపై రాకపోకలు సాగించే సమయంలో మిగతా ఎవరినీ రోడ్డుపైకి రాకుండా ఆంక్షలు, నియంత్రణలు అమలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ దేశీయుల భద్రత, చైనా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ప్రాజెక్టుకు ఆ దేశం నిధులు సమకూర్చినట్టు తెలుస్తోంది.
CPEC ఒప్పందంలో భాగంగా స్థానిక పాకిస్తాన్ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సి ఉండగా.. ఆచరణలో ఇప్పటి వరకు అది అమలు కాలేదు. స్థానిక సమాజానికి ఉపయోగం లేనప్పుడు అది ఎంత మెగా ప్రాజెక్టైనా స్థానికంగా సహకారం పొందలేదు. నిజానికి గ్వాదర్ పట్టణం తాగునీటి సమస్యతో పాటు విద్యుత్ కొరతతో తీవ్రంగా సతమతమవుతోంది. ప్రాథమిక అవసరాలే తీరని పరిస్థితుల్లో ఉన్న తమకు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఏమాత్రం ఉపయోగం లేదని గ్వాదర్ ప్రజలు భావిస్తున్నారు. మొత్తంగా గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయం “చైనా-పాకిస్తాన్ ప్రతిష్టాత్మక భౌగోళిక రాజకీయ వ్యూహాలకు నిదర్శనం”గా నిలుస్తున్నప్పటికీ, దాని ప్రస్తుత నిద్రాణస్థితి స్థానిక జనాభా తక్షణ అవసరాలు, ఆకాంక్షలు తీర్చడంలో విఫలమవుతోంది.