Lalit Modi: లలిత్ మోడీ నక్క జిత్తులు.. ఆర్థిక నేరగాడిని దేశానికి తీసుకురావడం ఇక కష్టమేనా..!
భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరగాళ్లు.. దేశానికి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు నక్కజిత్తులు వేస్తున్నారు. తాజాగా లలిత్ మోదీ కూడా భారత ప్రయత్నాలను అడ్డుకునేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే బయటి దేశం పౌరసత్వాన్ని స్వీకరించి.. భారత్‌కు రాకుండా తప్పించుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లు తెలివిమీరారు. వారిని వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కల్గించేందుకు వారు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌరసత్వాలను స్వీకరిస్తున్నారు. భారత్‌తో “నేరస్థుల అప్పగింత ఒప్పందం” లేని చిన్న చిన్న దేశాల నుంచి పౌరసత్వాన్ని కొనుక్కుంటున్నారు. కొంత మొత్తంలో పెట్టుబడులు పెడితే తమ దేశ పౌరసత్వాన్ని కూడా ఇచ్చే దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని, తమ దగ్గరున్న అక్రమ సొమ్ము నుంచి కొత్త పెట్టుబడి పెట్టి పౌరసత్వాన్ని సులభంగా సంపాదించుకుంటున్నారు. ఇలా భారత్ నుంచి పారిపోయి విదేశీ పౌరసత్వం పొందినవారిలో తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చీఫ్ లలిత్ మోడీ చేరారు. ఆయన పసిఫిక్ ద్వీప దేశం ‘వనౌటు’ పౌరసత్వాన్ని పొందారు. TV9 నెట్‌వర్క్ ఈ విషయాన్ని బహిర్గతం చేయడమే కాదు, లలిత్ మోడీ సరికొత్త ‘వనౌటు పాస్‌పోర్ట్’ కాపీని కూడా సంపాదించింది.
లలిత్ మోడీ ఎప్పుడు, ఎందుకు భారతదేశం పారిపోయాడు?
ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్, అవినీతి వంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్న లలిత్ మోడీ 2010లో లండన్‌కు పారిపోయాడు. భారతదేశ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లలిత్ మోడీపై అనేక కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. భారత కోర్టులు తమ ముందు హాజరు కావాలని సమన్లు కూడా జారీ చేశాయి. ఐపీఎల్ మీడియా హక్కులు మరియు ఫ్రాంచైజ్ ఒప్పందాల ద్వారా కోట్లాది రూపాయలు మోసం చేశాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
•మనీలాండరింగ్: IPL మీడియా హక్కులు మరియు ప్రసార ఒప్పందాలలో ఆర్థిక దుర్వినియోగ ఆరోపణలు. •విదేశీ మారక ద్రవ్య చట్టం (FEMA) ఉల్లంఘనలు: అనుమతి లేకుండా కోట్లాది రూపాయలను విదేశాలకు అక్రమంగా బదిలీ చేయడం. •బినామీ ఆస్తులు: అక్రమ మార్గాల ద్వారా విదేశాలలో ఆస్తులను కూడబెట్టడం.
లలిత్ మోడీని భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ దేశంలో తలదాచుకున్నాడో ఆ దేశంపై భారత్ దౌత్యపరంగా ఒత్తిడి పెంచింది. ఈ ప్రయత్నాలన్నీ సఫలమవుతున్నాయి అనుకుంటున్న తరుణంలో లలిత్ మోడీ పౌరసత్వంతో ఝలక్ ఇచ్చారు. ఆయన భారతీయుడై ఉండి విదేశాల్లో తలదాచుకుంటే.. వెనక్కి రప్పించేందుకు అవకాశాలు ఉంటాయి. అది కూడా ఆ దేశంతో “నేరస్థుల అప్పగింత ఒప్పందం” ఉంటేనే సాధ్యపడుతుంది. అలాంటిది భారతీయుడే కాని వ్యక్తిని భారత్‌కు రప్పించడం అంటే.. మరింత కష్టం, క్లిష్టతరం. ‘వనౌటు’ దేశ పౌరసత్వాన్ని పొందడం ద్వారా లలిత్ మోడీ ఇప్పుడు భారత ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు సరికొత్త సవాల్ విసిరాడు.
‘వనౌటు’ దేశాన్నే ఎందుకు ఎంచుకున్నాడు?
‘వనౌటు’ పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీప దేశం. ఆదాయ వనరులు పెద్దగా లేని ఈ చిన్న దేశం “పన్నుల స్వర్గధామం”గా పేరు తెచ్చుకుంది. అంటే పన్నులు, నిబంధనలు పెద్దగా ఏవీ అవసరం లేకుండా ఇతర దేశాల నుంచి సంపదను తీసుకొచ్చేందుకు వీలు కల్పించే దేశాలను పన్నుల స్వర్గధామం (Tax Heaven) దేశాలుగా వ్యవహరిస్తుంటారు. ఈ దేశం “గోల్డెన్ వీసా ప్రోగ్రామ్”ను నిర్వహిస్తుంది. ఆ ప్రకారం ఎవరైనా ఆ దేశంలో గణనీయంగా పెట్టుబడులు మోసుకొస్తే.. వారికి ఆ దేశం పౌరసత్వాన్ని ఇచ్చి సత్కరిస్తుంది. వేల కోట్ల రూపాయల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి ఆ దేశంలో కొంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడం పెద్ద కష్టమైన వ్యవహారమేమీ కాదు. పైగా ఈ దేశంతో భారతదేశానికి ఎలాంటి నేరస్థుల అప్పగింత ఒప్పందం లేదు. అందుకే వ్యూహాత్మకంగా లలిత్ మోడీ ఈ దేశాన్ని ఎంచుకుని పౌరసత్వాన్ని తీసుకున్నారు. భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు కాబట్టి.. ఆయన భారత పౌరసత్వం రద్దయిపోతుంది. దీంతో ఇప్పుడు లలిత్ మోడీ భారతీయుడే కాకుండా అయ్యాడు. అదే ఇప్పుడు అతన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలకు చట్టపరంగా తీవ్ర ఆటంకాలు సృష్టిస్తోంది.
లలిత్ మోడీ ‘వనౌటు’ పాస్‌పోర్ట్ నంబర్ RV0191750. అందులో ఉన్న వివరాల ప్రకారం పూర్తి పేరు ‘లలిత్ కుమార్ మోడీ’ అని, అతని జన్మస్థలం ‘న్యూఢిల్లీ’ అని ఉంది. అలాగే లలిత్ మోడీ పుట్టిన తేదీ 1963 నవంబర్ 29గా నమోదైంది. 2024 డిసెంబర్ 30న పాస్‌పోర్ట్ జారీ అయింది. అంటే దీని వయస్సు కనీసం 2 నెలలు కూడా లేదు. ఈ పౌరసత్వం కోసం లలిత్ మోడీ సమర్పించిన భారత పాస్‌పోర్ట్ కాపీతో పాటు వనౌటు దేశం జారీ చేసిన పాస్‌పోర్ట్ కాపీని టీవీ9 సేకరించింది.
మెహుల్ చోక్సీ అడుగుజాడల్లో
లలిత్ మోడీ దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. 2017లో చోక్సీ “ఆంటిగ్వా అండ్ బార్బుడా” దేశ పౌరసత్వాన్ని పొందాడు. చోక్సీని వెనక్కి రప్పించేందుకు భారతదేశం తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో ఆయన విదేశాల్లో ఉన్న చట్టపరమైన లొసుగులను ఉపయోగించుకుని తిరుగుతూ వచ్చాడు. అనంతరం విదేశీ పౌరసత్వాన్ని తీసుకుని వెనక్కి రప్పించే ప్రయత్నాలను మరింత జఠిలం చేశాడు. ఈ రోజు వరకు భారతదేశం అతన్ని వెనక్కి తీసుకురాలేకపోయింది.
తాజాగా లలిత్ మోడీ అదే వ్యూహాన్ని అనుసరించాడు. వనౌటు దేశ పౌరసత్వంతో మోడీ భారత పాస్‌పోర్ట్ స్వయంచాలకంగా రద్దయిపోయింది. ఫలితంగా అతణ్ణి విచారించడానికి భారతదేశానికి ఉన్న చట్టపరమైన అవకాశాలు పరిమితం అయ్యాయి.
వెనక్కి తీసుకొచ్చే అవకాశమే లేదా?
భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌరసత్వాన్ని తీసుకున్నంత మాత్రాన వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాల్లో మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి అనుకోడానికి వీల్లేదు. భారత ప్రభుత్వం ఇప్పటికీ లలిత్ మోడీని వెనక్కి తీసుకురావడానికి దౌత్య, చట్టపరమైన చర్యలను అనుసరించవచ్చు. వనౌటుతో నేరస్థుల అప్పంగిత ఒప్పందం లేకపోవడం ఈ ప్రక్రియను కష్టతరం చేస్తున్నప్పటికీ.. దౌత్యపరంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకొచ్చి, ఆ ప్రభుత్వాన్ని ఒప్పించగల్గితే.. వెనక్కి తీసురావడం సాధ్యపడుతుంది. ఇదంతా చేయాలంటే.. లలిత్ మోడీ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా కోరాల్సి ఉంటుంది. అలాగే వనౌటుపై దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతూ.. ప్రపంచ మనీలాండరింగ్ నిరోధక చట్టాల ప్రకారం చట్టపరమైన చర్యలు కోరవచ్చు. ప్రస్తుతానికి లలిత్ మోడీ భారత చట్టాన్ని తప్పించుకునే చర్య విజయవంతమైంది. కాకపోతే భారత్ వ్యూహాత్మకంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తే.. ఏదో ఒక రోజు ఆ దేశాన్ని ఒప్పించి.. ఇంటర్‌పోల్ సహాయంతో వెనక్కి తీసుకురావచ్చని ఒక ఆశతో ఉంది.