AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega DSC 2025 Notification: ఈ నెల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. ఉపాధ్యాయ పోస్టుల్లో 70% మేమే భర్తీ చేశాం.. మంత్రి లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గత ఏడాది జూన్‌ నుంచి కూటమి సర్కార్ ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ..

Mega DSC 2025 Notification: ఈ నెల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. ఉపాధ్యాయ పోస్టుల్లో 70% మేమే భర్తీ చేశాం.. మంత్రి లోకేశ్‌
Minister Nara Lokesh
Srilakshmi C
|

Updated on: Mar 05, 2025 | 5:11 PM

Share

అమరావతి, మార్చి 5: రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో 70 శాతం తమ ప్రభుత్వమే భర్తీ చేశామని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డీఎస్సీపైనే తొలి సంతకం చేశానని, అందులో భాగంగా ఇప్పటికే ఒకసారి టెట్‌ పరీక్ష కూడా నిర్వహించామన్నారు. ఇందులో రాష్ట్రంలోని దాదాపు 1.87 లక్షల మంది అభ్యర్ధులు అర్హత సాధించారని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. అసెంబ్లీలో వివిధ అంశాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలపై లోకేశ్‌ బదులిస్తూ.. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు. 1994 నుంచి 2,60,194 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయగా, వాటిలో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలే 1,80,272 వరకు ఉన్నాయన్నారు. అంటే 70 శాతం ఉపాధ్యాయ పోస్టులు తమ ప్రభుత్వమే భర్తీ చేసిందని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదిక త్వరలో రానుందని, వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. అలాగే తల్లికి వందనం పథకానికి త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని, ఈ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు.

మే 4న నీట్‌ పరీక్ష.. పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

‘నీట్‌’ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. మే 4న జరగనున్న నీట్‌ ఏర్పాట్లపై మార్చి 4న సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీట్‌ పరీక్ష నిర్వహణలో రాష్ట్రానికి మంచి ట్రాక్‌ రికార్డు ఉందని.. పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. అనంతరం భూక్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) పురోగతిపై కూడా సీఎస్‌ సమీక్షించారు.

ఇవి కూడా చదవండి

కాగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్‌-యూజీ 2025 ప్రవేశ పరీక్ష మే 4న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి నీట్‌ యూజీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా మార్చి 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 9 నుంచి మార్చి 11 వరకు తమ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు. కాగా గతేడాది నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ​​​​​​ మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.