ICAI 2025 Exam Schedule: సీఏ మే 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI).. సీఏ మే 2025 పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. చార్టర్డ్ అకౌంటెంట్లకు మే నెలలో సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల తేదీలతోపాటు ఆన్ లైన్ దరఖాస్తు వివరాలను కూడా వెల్లడించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఈ కింద పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..
న్యూఢిల్లీ, జనవరి 14: చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) మే 2025 పరీక్షల షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్లకు మే నెలలో సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు వేరు వేరుగా నిర్వహించనున్నారు. సీఏ మే 2025 పరీక్షల షెడ్యూల్ ప్రకారం.. మే 15 నుంచి మే 21 వరకు సీఏ ఫౌండేషన్ పరీక్షలు జరగనున్నాయి. మే 3వ తేదీ నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలు, మే 2వ తేదీ నుంచి 13 వరకు సీఏ తుది(ఫైనల్) పరీక్షలు జరుగుతాయి.
ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అందరూ అధికారిక వెబ్‌సైట్‌లో సెల్ఫ్-సర్వీస్ పోర్టల్ (SSP) ద్వారా ఆన్‌లైన్‌లో మే 2025 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఫీజు చెల్లించాలని ఐసీఏఐ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఆలస్య రుసుము లేకుండా మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. రూ.600 ఆలస్య రుసుముతో మార్చి 15 నుంచి మార్చి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
తమ పరీక్ష నగరాన్ని, మాధ్యమాన్ని మార్చుకోవాలనుకునే విద్యార్థులు మార్చి 18 నుండి 20 వరకు అప్లికేషన్‌లో మార్పులు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ పరీక్ష పేపర్‌లను ఇంగ్లీష్ లేదా హిందీలో రాయడానికి ఇష్టమొచ్చిన భాషను ఎంచుకోవచ్చు. అయితే, ఇంటర్నేషనల్ టాక్సేషన్ – అసెస్‌మెంట్ టెస్ట్ (INTT-AT) ఆంగ్లంలో మాత్రమే నిర్వహించబడుతుంది. పరీక్షల షెడ్యూల్, ఫీజులు, ఇతర మార్గదర్శకాలకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ICAI పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.