Inspirational Story: ఒకేసారి 7 సర్కార్ కొలువులకు ఎంపికైన గిరిజన యువకుడు.. పేదింటి బిడ్డ విజయగాథ
ఈ యువకుడి జర్నీ ఎందరో నిరుద్యోగులకు ఆదర్శం. మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన తండాలో పుట్టి.. ప్రభుత్వ బడుల్లో చదివి ఎలాంటి కోచింగ్ లేకుండా స్వశక్తిపై ఆధారపడి ఒకేసారి 7 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకున్నాడు..
పెద్దశంకరం పేట, నవంబర్ 12: కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని ఓ గిరిజన పుత్రుడు రుజువు చేశాడు. ఓ వైపు పేదరికం వెంటాడుతున్నా.. ఎటుగా సాగాలో చెప్పే దిశానిర్ధేశంచేసే మార్గదర్శి లేకున్నా.. సొంత కష్టంతో లక్ష్యాలన్నీ సాధించాడా యువకుడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 7 ప్రభుత్వ కొలువులకు సెలక్ట్ అయ్యాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీతోపాటు ఒకేసారి 7 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన ఈ కుర్రోడి విజయగాథ మీరూ తెలుసుకోండి..
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం వీరోజిపల్లి తండా గ్రామానికి చెందిన డేగావత్ చక్య్రా, మీరాబాయి దంపతులకు ఐదుగురు కుమారులు. వీరిది వ్యవసాయ కుటుంబం. నాలుగో సంతానం డేగావత్ రాందాస్. రాందాస్ చిన్నతనం నుంచి చదువులో రానించేవాడు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివాడు. తండాలో ప్రాథమిక, ఉత్తులూరు (సిద్దిపేట), పెద్దశంకరంపేట (సంగారెడ్డి)లో ఉన్నత పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం పూర్తి చేసి డిగ్రీ పట్టా పొందాడు. అనంతరం ఎలాగైనా టీచర్ అవ్వాలనే లక్ష్యంతో డీఈడీ, బీఈడీ.. రెండు డిగ్రీలు పూర్తి చేశాడు.
ఇటీవల తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన డీఎస్సీ నియామక పరీక్షలో వరుసగా ఏడబ్ల్యుఈఎస్, ఎన్‌ఆర్‌ఈఐఎస్, జ్యోతిబా ఫులే గురుకులంలో లెక్కల సబ్జెక్టులో టీజీటీ ఉద్యోగాలను సాధించాడు. మరోవైపు తెలంగాణ గ్రూప్ 4 పోస్టుకు కూడా ఎంపికయ్యారు. ఇక డీఎస్సీలో ఎస్జీటీలో జిల్లాలో 11వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ గణితంలో 6వ ర్యాంకు, హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో జోన్ 3లో కేటగిరిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఇలా రాందాస్ మొత్తం 7 ప్రభుత్వ ఉద్యోగాలకు ఏకకాలంలో ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచాడు. రాందాస్ ప్రస్తుతం పాపన్నపేట మండలం చీకోడ్-లింగాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. సంగారెడ్డిలోని గ్రంథాలయానికి రోజూ వెళ్లి చదువుకునేవాడు. రాందాస్ ప్రస్తుతం తమ్ముడిని డిగ్రీ చదివిస్తున్నాడు. బోధనా రంగం అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి చదివానని రాందాస్ చెబుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన తాను ఎలాంటి శిక్షణ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించగలగడం సంతోషంగా ఉందని రాందాస్ తెలిపాడు.