Private Hospital: ఓరి దుర్మార్గుల్లారా! తలకు గాయమై ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ల చేతివాటం.. ఏం చేశారంటే

తలకు గాయమై ఆస్పత్రిలో చేరితే ఆ ఆసుపత్రి వైద్యులు పొత్తి కడుపులో ఆపరేషన్ చేశారు. అనంతరం 3 రోజులకే సదరు రోగి మరణించాడు. తీరా అంత్యక్రియలు జరుపుతుండగా మృతుడి శరీరంపై కత్తిగాట్లు గమనించిన కుటుంబ సభ్యులు అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బయటికి వచ్చింది..

Private Hospital: ఓరి దుర్మార్గుల్లారా! తలకు గాయమై ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ల చేతివాటం.. ఏం చేశారంటే
Doctors Steals Man Organs
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 19, 2024 | 8:05 PM

కటక్‌, అక్టోబర్‌ 19: మినీ ట్రక్కు ఢీకొని తలకు గాయమై ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరితే.. అక్కడి వైద్యులు చేతివాటం చూపారు. రోగికి తెలియకుండా అతడి పొత్తికడుపులో శస్త్రచికిత్స చేశారు. మూడు రోజుల తర్వాత సదరు రోగి మరణించాడు. అతడి పొత్తి కడుపుపై ఆపరేషన్‌ చేసిన గుర్తులు ఉన్నాయని, ఒంట్లో అవయవాలు దొంగిలించి ఉంటారని మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించేందుకు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల్లోకెళ్తే..

అక్టోబర్‌13న బాబులాదిగల్‌ అనే ఓ వ్యాపారి తన భార్య, కుమారుడితో కలిసి మోటార్‌ సైకిల్‌పై రాంపూర్‌కు వెళ్తుండగా.. ఓ మినీ ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబులాదిగల్‌ తలకు బలమైన గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు అతణ్ని కటక్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత అక్టోబర్ 16న మృతి చెందాడు. మూడు రోజులుగా తలకు అయిన గాయం కోసం మాత్రమే చికిత్స పొందుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఖననం చేస్తున్న సమయంలో మృతుడి పొత్తికడుపుపై కత్తితో కోసినట్లు గుర్తులు గమనించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యం పేరిట సదర ఆస్పత్రి వైద్యులు తమ తండ్రి శరీరంలో అవయావాలను దొంగిలించారని, అందుకే ఎటువంటి పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారని మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 17న కంధమాల్ జిల్లా బలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని టికారాబాజు వద్ద శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అవయవ చోరీపై మృతుడి కుమారుడి ఆరోపణలపై మేము దర్యాప్తు చేస్తున్నాం. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అన్ని వివరాలు తెలుస్తాయ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ సుశాంత్ సాహు తెలిపారు. మరోవైపు తమ ఆసుపత్రి వైద్యులు ఎలాంటి తప్పు చేయలేదని, బాబులాదిగల్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యులకు ముందే సమాచారమిచ్చినట్లు ఆసుపత్రి యాజమన్యం మీడియాకు తెలిపారు. ఈ ఆరోపణలపై ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ విచారణకు ఆదేశించారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భువనేశ్వర్-కటక్ కమిషనరేట్ పోలీసుల బృందం విచారణ కోసం కటక్‌లోని సదురు ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.