TGPSC Group 2 Postponment: ఒకే రోజు రెండు పరీక్షలు.. గ్రూప్‌ 2 వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటీషన్‌!

తెలంగాణలో మరో రెండు వారాల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్షలు మరోమారు వాయిదా వేయాలంటూ అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు కారణం రైల్వేశాఖ RRB పరీక్షే కారణం. ఈ రెండు పరీక్షలు సరిగ్గా ఒకటే రోజు జరగనున్నాయి..

TGPSC Group 2 Postponment: ఒకే రోజు రెండు పరీక్షలు.. గ్రూప్‌ 2 వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటీషన్‌!
TGPSC Group 2 Postponment
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 02, 2024 | 9:03 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2: తెలంగాణ గ్రూప్‌ 2 వాయిదా వేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఒకవైపు పరీక్ష తేదీలు సమీపిస్తున్నా దీనిపై రేవంత్‌ సర్కార్‌ ఏ మాత్రం స్పందించడం లేదు. దీంతో విసిగెత్తిపోయిన నిరుద్యోగులు హైకోర్టు తలుపుతట్టారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. ఆర్‌ఆర్‌బీ పరీక్ష తేదీలోనే టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఏదైనా ఒకటి వదులుకుని మరో పరీక్ష రాయవల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్న అభ్యర్థులు ఆఖరుకు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం తమ గోడును వినకపోవడంతో ఈ మేరకు సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గ్రూప్‌ 2కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌ 1, 3 పరీక్షలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్‌ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే గ్రూప్‌-2 సర్వీసు పరీక్ష తేదీలోనే రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) పరీక్షనూ నిర్వహిస్తోంది. 16న ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 7,951 జూనియర్‌ ఇంజినీరింగ్‌(జేఈ) పోస్టులను రైల్వేశాఖ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. బీటెక్‌, డిగ్రీ అర్హతలున్న వారు ఈ పోస్టులకు పోటీపడుతున్నారు. ఇదే బీటెక్‌ అర్హత గల వారు గ్రూప్‌ 2కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అటు గ్రూప్‌-2, ఇటు ఆర్‌ఆర్‌బీ రెండు పరీక్షలు రాసే వారు రాష్ట్రంలో 20 మందికిపైగా ఉన్నట్టుగా తేలింది. దీంతో ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో గ్రూప్‌ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఇటీవలే టీజీపీఎస్సీ చైర్మన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అయినా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండటంతో చేసేదిలేక పోరుబాట పట్టారు. వీరు సోమవారం హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.

ఎన్నో ఏళ్ల తర్వాత ఆర్‌ఆర్‌బీ జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైందని, అలాగే సుమారు ఏడేళ్ల తర్వాత గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ సైతం వచ్చిందని.. ఏది వదులుకున్నా తమకు తీరని అన్యాయం జరుగుతుందని.. రెండు ముఖ్యమైన పరీక్షలేనని అభ్యర్ధులు చెబుతున్నారు. అందుకే గ్రూప్‌ 2 పరీక్షలను వాయిదావేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.. ప్రభుత్వం మాత్రం మొండి వైకరితో తమ గోడు పట్టించుకోవడం లేదని, విధిలేని పరిస్థితుల్లో మేం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదాపడిన గ్రూప్‌ 2 పరీక్ష మరోసారి వాయిదా పడుతుందో లేదో.. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.