Harwinder Kaur : ఆమె సంకల్పం ముందు ‘హైట్’ తలవంచింది..! లాయర్‌గా మారిన 3 అడుగుల యువతి..
Harwinder Kaur : 'కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు' అనే దానికి ఈ పంజాబ్‌కి చెందిన యువతి సరితూగుతుంది.
Harwinder Kaur : ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు’ అనే దానికి ఈ పంజాబ్‌కి చెందిన యువతి సరితూగుతుంది. పట్టుదల ఉంటే అంగవైకల్యం, శారీరక సమస్యలు అడ్డుకాదని నిరూపించింది. మూడు అడుగుల 11 అంగుళాల ఎత్తున్న హర్విందర్కౌర్అలియాస్ రూబీ లాయర్ కొలువు సంపాదించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. తన జీవితంలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్న ఈ 24 ఏళ్ల యువతి అందరికి సమాధానం చెప్పేవిధంగా ఎదిగింది. స్కూల్ మానేసిన అమ్మాయి లాయర్‌గా ఎలా ఎదిగిందో తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు.
జలంధర్ రామ మండిలోని అర్మాన్నగర్లో నివసించే రూబీ జీవితం పదేళ్ల వరకు సాఫీగానే సాగింది. తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకునేది. అయితే వయసు పెరుగుతున్నా ఆమె ఎత్తు అంతగా పెరగలేదు. దీంతో తాను ఇతరుల్లా కాదని రూబీకి తన పదో ఏటనే అర్థమైంది. ఇతరులు తనను చిన్నచూపు చూడటం, గేలి చేయడం భరించలేకపోయింది. దీంతో పాఠశాలకు వెళ్లడం తగ్గించేసింది. ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేది. ఇంట్లోనే చదువుకుంటూ 10వ తరగతి, ఇంటర్ పాసయ్యింది. తన శక్తిసామర్థ్యాలపై తనకే విశ్వాసం సన్నగిల్లితున్న తరుణంలో ఆత్మవిశ్మాసాన్ని పెంపొందించుకుంది. ఏదైనా సాధించాలని నిశ్చయించుకొంది. డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లేది.
తమ ఇంట్లో అందరూ సాధారణ ఎత్తే ఉంటారని తెలిపారు. కేవలం లా పూర్తి చేయడమే కాకుండా, అందరి మనసులు గెలుచుకోవాలని తాను అనుకున్నట్లు వివరించారు. లాయర్ అయ్యాక అందరూ తనను గౌరవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దివ్యాంగుల తరఫున కోర్టులో ఉచితంగా వాదిస్తానని చెబుతున్నారు. తాను మొదట ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నానని, కానీ అది సాధ్యం కాదని తెలిసి లాయర్ అవ్వాలనుకున్నట్లు రూబీ పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగ్పాల్ సింగ్ వద్ద లా ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉండి ఆత్మహత్యలు చేసకుంటున్న ప్రస్తుత సమాజంలో రూబీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అందరు భావిస్తున్నారు.