AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Schools: 18 వేల టీచర్‌ పోస్టులకు మంగళం పాడనున్న ఏపీ సర్కార్! డీఎస్సీ రిక్రూట్‌మెంట్ లేనట్టే..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు దినదిన గండంగా ఉంది. తాజాగా విద్యాశాఖ జారీ చేసిన ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సుమారు 18,000ల టీచర్‌ పోస్టుల రద్దుకు..

AP Govt Schools: 18 వేల టీచర్‌ పోస్టులకు మంగళం పాడనున్న ఏపీ సర్కార్! డీఎస్సీ రిక్రూట్‌మెంట్ లేనట్టే..?
Ap Schools
Srilakshmi C
|

Updated on: Jun 14, 2022 | 11:26 AM

Share

AP Teachers Rationalization 2022 Norms: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు దినదిన గండంగా ఉంది. తాజాగా విద్యాశాఖ జారీ చేసిన ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సుమారు 18,000ల టీచర్‌ పోస్టులు రద్దవుతున్నాయి. కొత్తగా నియామకాలు చేపట్టడానికి బదులు ఉన్న ఉపాధ్యాయులను తీసివేసే దిశగా ఈ విధానాన్ని రూపొందించింది. ఇకపై 9, 10 తరగతుల్లో మాత్రమే తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం అమలు కాబోతుంది. 1 నుంచి 8 తరగతుల వరకు కేవలం ఇంగ్లిష్‌ మీడియం మాధ్యమం మాత్రమే ఉంటుంది. తెలుగు మాధ్యమం కూడా ఉంటే రెండు మీడియంలకు వేరువేరుగా ఉపాధ్యాయులను కేటాయించవల్సి వస్తుందనే కారణంతో ఒకేదాన్ని తీసుకొచ్చారు. ఫలితంగా తెలుగు మాధ్యమంలోని సబ్జెక్టులకు సంబంధించిన టీచర్‌ పోస్టులు మిగిలిపోతాయి. వీటిని అవసరమైన చోట సర్దుబాటు చేస్తారు. దీంతో కొత్త నియామకాల అవసరం ఉండదు.

విద్యాశాఖ జారీ చేసిన ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం 3 నుంచి 10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలల్లో 137 మంది, 6 నుంచి 10 తరగతుల బడిలో 92లోపు విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయ, పీఈటీ పోస్టులు ఉండవు. నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ ఉండాలి. విద్యార్థులు తక్కువగా ఉన్నంత మాత్రన పీఈటీ అవసరం లేకుండా ఎలా పోతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏకోపాధ్యయ పాఠశాలలు అవతరణ మరోవైపు 17 సెక్షన్ల విద్యార్థులకు ఒకే హిందీ ఉపాధ్యాయుడిని కేటాయించారు. దీని ప్రకారం ఒక్కో సబ్జెక్టు ఉపాధ్యాయుడు వారానికి 48 తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఎవరైనా సెలవులు పెడితే ఉపాధ్యాయులపై పనిభారం మరింత పెరుగుతుంది. 3 నుంచి 8 తరగతుల బడులకు ప్రధానోపాధ్యాయుడి పోస్టును కేటాయించలేదు. ప్రధానోపాధ్యాయుడు లేనిచోట స్కూల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు. ఐతే చాలా వరకు బడుల్లో 30లోపు విద్యార్ధులున్నారు. ఇవన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. ఒక వేళ ఉపాధ్యాయుడు ఏదైనా కారణం చేత సెలవు పెడితే పక్క పాఠశాల నుంచి మరొకర్ని పంపించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

4764 ఎస్జీటీ పోస్టుల రద్దు..! అంతేకాకుండా కిలోమీటరులోపుండే ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఆయా తరగతులు బదిలీల మూలంగా మిగిలివుండే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎస్జీటీ పోస్టులను ఉన్నత పాఠశాలకు తరలిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో 121 మంది కంటే ఎక్కువ విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడిని ఇవ్వనున్నారు. ఈ కారణంగా ఇకపై ప్రధానోపాధ్యాయ పోస్టు కొన్నిచోట్ల మాత్రమే ఉంటుంది. 30 మంది విద్యార్ధులకు ఒక టీచర్‌ ఉండాలనే ప్రాతిపదికన ఎస్జీటీ పోస్టులు భారీగా మిగిలిపోతున్నాయి. గతంలో ఒక టీచర్‌కు 20 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన ఉండేది. వీరిలో అర్హతలున్న వారికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చి, సబ్జెక్టు ఉపాధ్యాయుల ఖాళీలను సర్దుబాటు చేస్తారు. ఇప్పటికే ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న 3,260 మంది ఉపాధ్యాయులను సర్వీసు నిబంధనల్లోకి తెచ్చి, 4764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు.

ఖాళీగా ఉన్న18,000ల టీచర్ పోస్టుల భర్తీ లేనట్లేనా? ఉన్నత పాఠశాలల్లో 1,796 సబ్జెక్టు టీచర్‌ ఖాళీలున్నాయి. బదిలీల సమయంలో 15,000ల వరకు పోస్టులను బ్లాక్‌ చేశారు. ఇవికాకుండా ఉద్యోగ విరమణలు, మరణాలతో మరో 1000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపితే సుమారు 18,000ల వరకు ఖాళీలున్నాయి. కొత్తగా డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయాల్సి ఉండగా సర్దుబాటు చేసి, చేతులు దులుపుకుంటున్నారు. దీంతో నిరుద్యోగులకు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు ఒక్కమాటైనా చెప్పకుండా తమపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో టెట్‌ 2022 పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్‌ కూడా విడుదలయ్యింది. ఉన్న టీచర్లతో సర్దుబాటు చేసి, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు టెట్ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.