AP Inter Exams 2024: నేటి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు బోర్డు సర్వం సిద్ధం చేసింది. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అంటే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని స్పష్టం..

అమరావతి, మార్చి 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు బోర్డు సర్వం సిద్ధం చేసింది. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అంటే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని విద్యార్ధులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమేరాలతో నిఘా ఉంచారు. వీటన్నింటినీ తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు, విజయవాడలోని డీఐఈవో కార్యాలయాలకు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ , సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఇంటర్ మొదటి ఏడాది, శనివారం నుంచి ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు ప్రారంభమవుతాయి. కాగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు. వారిలో ఫస్ట్ ఇయర్ 4,73,058 మంది, సెకండ్ ఇయర్ 5,79,163 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో మొత్తం 1,559 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు.
అలాగే పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను నియమించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ సారి ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్ధి, ఇన్విజిలేటర్ల హాజరును ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లా్కు ఓ కంట్రోల్ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు. ‘డిజిటల్ నిఘా’ కింద ఎలాంటి అవాంచిత సంఘనలు చోటు చేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. అలాగే ఎగ్జాం క్వశ్చన్ పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను ముద్రించారు. దీంతో పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా వెంటనే తెలిసిపోతుంది. దివ్యాంగ విద్యార్థులకు మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచామన్నారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్‌ల స్వీకరణకు 08645–277707, టోల్‌ఫ్రీ నంబర్ 18004251531లను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




