Nursing Students: నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో ట్రైనింగ్ ఇవ్వండి.. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో నర్సింగ్ విద్యార్ధులకు విదేశీ భాషా కోర్సులు ప్రవేశపెట్టేందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఆమోదయోగ్యమైన నైపుణ్యాన్ని పొందడానికి అవసరమైన విదేశీ భాషలను బోధించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు..

అమరావతి, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాష కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. విదేశాల్లో ఉద్యోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు పలు విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లోని నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా భాషల బోధకుల లభ్యత, ఇతర మౌలిక వసతులపై అధ్యయనం చేయాలని మంత్రి సత్య కుమార్ అధికారులకు సూచించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి నర్సింగ్ విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుందని, తద్వారా ఉద్యోగ అవాకాశాలు మెరుగుపడతాయని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో నర్సింగ్ విద్యార్ధులకు విదేశీ భాషా కోర్సులు ప్రవేశపెట్టేందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో వివరణాత్మక చర్చలు జరిపి, వారి నుంచి వివరణాత్మక ప్రతిపాదనలు కోరారు. నర్సింగ్ విద్యార్థులు ఆతిథ్య దేశాలకు ఆమోదయోగ్యమైన నైపుణ్యాన్ని పొందడానికి అవసరమైన విదేశీ భాషలను బోధించే వ్యవధి, విదేశీ భాషా సర్టిఫికేట్ ప్రదానం, ఆయా విదేశీ భాషలలో ఉపాధ్యాయుల లభ్యత, విదేశీ భాషలలో శిక్షణను పాఠ్యాంశాల్లో భాగంగా తీసుకోవాలా? లేదా పాఠ్యాంశాలకు సంబంధం లేకుండా వెలుపల తీసుకోవాలా? వంటి ఇతర వివరాలను పరిశీలించాలని ఆయన వైద్య విద్య డైరెక్టర్‌ను ఆదేశించారు.
నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలలో వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి, విదేశాలలో ఉపాధి అవకాశాలను పొందడానికి వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి, శిక్షణ ఇవ్వడానికి AP నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్‌తో కలిసి అనేక విదేశీ భాషా కోర్సులను ప్రవేశపెట్టాలని ఆ శాఖ భావిస్తుంది. అయితే ఎక్కువ మంది నర్సింగ్ విద్యార్థులు జర్మన్, జపనీస్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వంటి భాషలను ఇష్టపడుతున్నట్లు సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 500 కంటే ఎక్కువ నర్సింగ్ కళాశాలల నుంచి 30 వేలకుపైగా శిక్షణ పొందిన నర్సులు బయటకు వస్తున్నారు. విదేశీ భాషల్లో వీరికి అవగాహన ఉంటే విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలను తీసుకొచ్చింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




