AP EAPCET 2025 Exam Today: మరికాసేపట్లో ఈఏపీసెట్ పరీక్షలు ప్రారంభం.. గంటన్నర ముందే కేంద్రంలోకి ఎంట్రీ అనుమతి!
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2025 ఆన్‌లైన్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్..

అమరావతి, మే 19: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2025 ఆన్‌లైన్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,80,597 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. కాకినాడలోని జేఎన్‌టీయూ ఈ ఏడాది కూడా ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించే బాధ్యతలు చేపట్టింది. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 145, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఒక్కోటి చొప్పున పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ తేదీల్లో పరీక్షలు రాసే విద్యార్ధులకు వేరే జాతీయ స్థాయి పరీక్ష ఏదైనా ఉంటే ఆధారాలతో హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలని, వాటిని పరిశీలించి పరీక్ష తేదీని మార్పుచేస్తామని కన్వీనర్ తెలిపారు. ఉర్దూ మీడియం ఎంచుకున్న అభ్యర్థులు కర్నూలు రీజినల్ సెంటర్‌లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందని, దివ్యాంగులకు సహాయకులను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్షకు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు.
అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది. బయోమెట్రిక్‌కు ఆటంకం లేకుండా చేతులపై మెహందీ పెట్టుకోకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. అలాగే అభ్యర్ధులు సులువుగా పరీక్షకేంద్రాలకు చేరుకోవడానికి హాల్‌టికెట్‌పై పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ కూడా ముద్రించారు. హాల్‌టికెట్లను ఏపీ ఈఏపీసెట్ వెబ్‌సైట్ నుంచి, మన మిత్ర వాట్సాప్ యాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 0884–2359599, 0884–2342499 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అయితే విభజన చట్టం ప్రకారం పదేళ్లు గడువు ముగిసినందున 2025-26 విద్యా సంవత్సరం నుంచి సీట్లన్నీ ఏపీ విద్యార్ధులకే దక్కనున్నాయి. అన్ రిజర్వుడు కోటాలో తెలంగాణకు కేటాయించే 15 శాతం సీట్ల కోటా రద్దు చేసింది. మౌలిక వసతుల ఆధారంగా కళాశాలలు సొంతంగా సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు కూడా ఈసారి ఏఐసీటీఈ కల్పించింది. దీంతో ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.