TG Engineering Seats: ఇంజనీరింగ్‌లో మొత్తం 98,296 సీట్లు అందుబాటులోకి.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్ల విషయంలో అధికారుల లెక్కలు ఓ కొలిక్కి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లున్నట్టు అధికారులు తెలిపారు. వీటిల్లో కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లుండగా, మేనేజ్‌మెంట్ కోటా కింద 27,989 సీట్లు అందుబాటు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు 2024--25 విద్యాసంవత్సరం భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ..
హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్ల విషయంలో అధికారుల లెక్కలు ఓ కొలిక్కి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లున్నట్టు అధికారులు తెలిపారు. వీటిల్లో కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లుండగా, మేనేజ్‌మెంట్ కోటా కింద 27,989 సీట్లు అందుబాటు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు 2024–25 విద్యాసంవత్సరం భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవనసేన ఆదివారం వెల్లడించారు.
ఈ ఏడాది బీటెక్ సీట్లల్లో సగానికి పైగా సీట్లు సీఎస్‌ఈ అనుబంధ బ్రాంచీల్లోనే ఉండటం గమనార్హం. కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లల్లో దాదాపు 41,968 (59. 69 శాతం) సీట్లు సీఎస్‌ఈ అనుబంధ బ్రాంచ్‌లలో ఉన్నాయి. సీఎస్‌ఈ కోర్సుల్లో సీట్లు గణనీయంగా పెరుగడంతో మిగతా బ్రాంచీల్లో సీట్లు తగ్గిపోతున్నాయి. యూనివర్సిటీలు, యూనివర్సిటీ కాన్‌స్టియంట్ కాలేజీలు 21 ఉన్నాయి. వీటిల్లో 7,153 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటాలో 6,603 సీట్లున్నాయి. ఇక 152 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 91,143 ఉండగా, కన్వీనర్ కోటాకి 63,704 సీట్లున్నాయి.
త్వరలోనే మరికొన్ని కోర్సులకు కూడా అనుమతులొచ్చే అవకాశం ఉందని, దీంతో సీట్ల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ బ్రాంచిల్లో సీట్లను తగ్గించి, సీఎస్‌ఈలో సీట్లను పెంచుకునే దిశలో సమాలోచనలు చేస్తున్నారు. ఇక జులై 7న జరిగిన మొదటి విడత ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌కు 91,530 మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో 25,041 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు. జులై13 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్లు నేటి నుంచి ప్రారంభమవుతాయి. జులై 15 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జులై 19లోపు మొదటి విడత సీట్ల కేటాయింపు ముగుస్తుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వివరించారు.