Nirmala Sitharaman: ఆర్థిక లావాదేవీలు సులభతరం చేసేందుకు ఒకే KYC.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..
అన్ని రకాల ఆర్థిక లావాదేవీల నిర్వహణ సులభతరం చేసేందుకు వీలుగా ఉమ్మడి కేవేసీ విధానం అమలుపై చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సెంట్రల్ కేవైసీ కోసం సెంట్రల్ రిపాజిటరీ ఉందని..
Nirmala Sitharaman: అన్ని రకాల ఆర్థిక లావాదేవీల నిర్వహణ సులభతరం చేసేందుకు వీలుగా ఉమ్మడి కేవేసీ విధానం అమలుపై చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సెంట్రల్ కేవైసీ కోసం సెంట్రల్ రిపాజిటరీ ఉందని, అయితే ఒక్కసారి కేవైసీ ఇస్తే పలు ఆర్థిక సంస్థల వద్ద, వేర్వేరు సమయాల్లో, పలు అవసరాలకు అది ఉపయోగపడేలా చేయడంపై దృష్టి సారించామన్నారు. దీనివల్ల ప్రతిసారీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం తప్పుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఫిక్కీ లీడ్స్ 2022 కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్, బీమా, క్యాపిటల్ మార్కెట్ల కోసం ఉమ్మడి కేవైసీ ప్రక్రియ అంశంపై గత వారం ఆర్థిక రంగంలోని నియంత్రణ సంస్థలతో తమ మంత్రిత్వ శాఖ చర్చించిందన్నారు. ఉమ్మడి కేవైసీతో పేపర్ వర్క్ తగ్గుతుందని, సాధారణ పౌరులు బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త డీమ్యాట్ ఖాతా తెరవాలన్నా ఉమ్మడి కేవైసీ ద్వారా ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జూలై నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.10.62 లక్షల కోట్లు దాటిందని, 628 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో యూపీఐ లావాదేవీలను రోజుకు 100 కోట్లకు చేర్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ మరింత డిజిటైజ్ అవుతుందని తెలిపారు.
ప్రభుత్వం, ఫిన్‌టెక్ పరిశ్రమ మధ్య దూరం తగ్గాలని, సయోధ్య పెరగాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీల నమ్మకాన్ని చూరగొనేందుకు పరిశ్రమ మరింత తరచుగా సంప్రదింపులు జరుపుతుండాలని తెలిపారు. దూరం వల్ల అపనమ్మకం పెరుగుతుందని అందుకే దూరం తగ్గించుకోవాలన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..