ఆధార్ కార్డుతో ఓటర్ ఐడి లింక్ చేస్తే ప్రయోజనాలేమిటి..? ప్రభుత్వం ప్రతిపాదించే కొత్త బిల్లు గురించి తెలుసుకోండి..
Voter ID With Aadhaar:'ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021' లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లులో ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్
Voter ID With Aadhaar:’ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021′ లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లులో ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయాలనే నిబంధన ఉంది. కానీ ఇది తప్పనిసరి కాదు. ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా, లోక్‌సభలో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీఎస్పీ వంటి పార్టీలు అభ్యంతరం తెలిపాయి. అయితే ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ బిల్లు ప్రకారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మీ గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ కార్డును అడగవచ్చు.
18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఏడాదికి 4 సార్లు ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని ఈ బిల్లులో ఉంది. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1 , అక్టోబర్ 1 తేదీల్లో యువత ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏడాదికి ఒకసారి అంటే జనవరి 1వ తేదీలోపు 18 ఏళ్లు నిండితే మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. బిల్లు ప్రకారం ఒక వ్యక్తి తన ఓటర్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలనుకుంటే చేయవచ్చు. కానీ ఇది అతడి ఇష్టం.
ఓటరు, ఆధార్ కార్డ్ లింక్ వల్ల ప్రయోజనం ఏమిటి? ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఓటింగ్‌లో అవకతవకలను అరికట్టవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇది అమలైతే వలస ఓటర్లు తమ ఓటరు కార్డు ఉన్న చోటే ఓటు వేయగలుగుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన గ్రామంలోని ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉన్నాడు. చాలా కాలంగా అతడు నగరంలో నివసిస్తున్నాడు. ఆ వ్యక్తి నగరంలోని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం రెండు చోట్లా ఓటరు జాబితాలో ఆ వ్యక్తి పేరు ఉంటుంది. అయితే దీన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తే ఒక చోట మాత్రమే పేరు కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి తన ఓటును ఒకే చోట మాత్రమే వేయగలడు.
ఫిబ్రవరి 2015లో భారత ఎన్నికల సంఘం ఓటర్ ID కార్డ్ (EPIC)ని ఆధార్‌తో లింక్ చేయడం ప్రారంభించింది. దీన్ని అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌ఎస్ బ్రహ్మ ప్రారంభించారు. అయితే PDS, LPG, కిరోసిన్ పంపిణీలో ఆధార్ వినియోగాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసిన కారణంగా ఆ సంవత్సరం ఆగస్టులో ఎన్నికల సంఘం ఈ చర్యను నిలిపివేసింది. అయితే అప్పటికే దాదాపు 38 కోట్ల ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు.