Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్.. మారిన రైళ్ల టైమింగ్స్.. కొత్త వేళలు ఇవిగో.
వందే భారత్ రైళ్ల టైమింగ్స్‌ను రైల్వేశాఖ మార్చింది. యశ్వంతపూర్-కాచిగూడ-యశ్వంతపూర్, కలబురగి-బెంగళూరు-కలబురగి మధ్య తిరుగుతున్న ట్రైన్ల షెడ్యూల్స్‌లో మార్పులు జరిగాయి. వీటి గురించి ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని రైల్వేశాఖ సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు..

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు వందే భారత్ రైళ్ల టైమింగ్స్‌ను మార్చింది. రైల్వే ప్రయాణికులు వీటి గురించి సమాచారం తెలుసుకుని ప్రయాణినికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త వేళలు అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వేశాఖకు సహకరించాలని, ప్రయాణికులు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని రైల్వేశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఏయే ట్రైన్ల షెడ్యూల్స్ మారాయి.. కొత్త టైమింగ్స్ ఏంటి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు వందే భారత్ టైమింగ్స్‌లో మార్పులు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అనేక వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి వైపు రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో ప్రయాణికుల ఆక్సుపెన్సీ ఎక్కువగానే ఉంటుంది. వేగవంతంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు అత్యాధునిక సర్వీసులు అందుబాటులో ఉండటంతో వీటిల్లో ఎక్కువమంది ప్రయాణిస్తున్నారు. వీటిల్లో యశ్వంతపూర్-కాచిగూడ-యశ్వంతపూర్, కలబురగి-బెంగళూరు-కలబురగి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఉండగా.. వీటి టైమ్ షెడ్యూల్స్‌లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. యశ్వంతపూర్ – కాచిగూడ(20704) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పటివరకు హిందూపూర్‌కు మధ్యాహ్నం 3.48 గంటలకు చేరుకుని.. 3.50కి బయల్దేరేది. మార్చి 15 నుంచి ఈ టైమింగ్స్‌ను సవరించారు. ఇక నుంచి మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని 3.57 గంటలకు బయల్దేరుతుంది.
ప్రయాణికులకు సూచన
ఇక కాచిగూడ-యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్(20703) హిందూపూర్‌కు మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని 12.19కి బయల్దేరనుంది. గతంలో ఇది మధ్యాహ్నం 12.08 గంటలకు చేరుకుని 12.10 గంటలకు బయల్దేరేది. అటు కలబురగి – బెంగళూరు వందేభారత్ ట్రైన్( 22231) గతంలో శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుని 11.02 గంటలకు బయల్దేరేది. ఇక నుంచి 11.13 గంటలకు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు యల్హంక రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం 12.28 గంటలకు చేరుకునేది. ఇప్పుడు ఇది 12.30 గంటలకు వస్తుంది. అటు బెంగళూరు-కలబురగి వందే భారత్ (22232) యల్హంక స్టేషన్‌కు మధ్యాహ్నం 3.05 గంటలకు గతంలో వచ్చేది. అయితే ఇప్పుడు అది 3.09 గంటలకు చేరుకుంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. ఇక శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.23 గంటలకు గంటలకు గతంలో చేరుకునేది. ఇప్పుడు ఇక సాయంత్రం 4.45 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ టైమింగ్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని రైల్వేశాఖ సూచించింది. అటు వారంలో ఆరు రోజుల పాటు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. నిర్వహణ పనుల కారణంగా ఒక రోజు సేవలు అందించదు.
