AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Tips: అప్పులు, ఆర్థిక కష్టాల్లేని జీవితం కావాలా..? సీక్రెట్ టిప్స్ మీ కోసం..!

అప్పుల్లేని జీవితం కోసం కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే కాదు.. సరైన ఆర్థిక అలవాట్లు కూడా ఎంతో ముఖ్యం. ఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయడం, ముందుగానే పొదుపు చేయడం, అవసరం లేని అప్పులను దూరంగా ఉంచడం వంటి 10 కీలక సూత్రాలు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తాయి. ఈ సూచనలు పాటిస్తే మీకున్న అప్పులు క్రమంగా తీరిపోవడంతో పాటు భవిష్యత్తులో అప్పుల ఊబిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు.

Money Tips: అప్పులు, ఆర్థిక కష్టాల్లేని జీవితం కావాలా..? సీక్రెట్ టిప్స్ మీ కోసం..!
Money Tips In Telugu
Janardhan Veluru
|

Updated on: May 21, 2026 | 5:47 PM

Share

అప్పుల ఊబిలో చిక్కుకోకుండా, ఆర్థిక స్వేచ్ఛతో జీవించాలన్నది ప్రతి ఒక్కరి కలగా ఉంటుంది. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా జీవించడానికి పలువురు ఆర్థిక నిపుణులు పలు సూచనలు చేశారు. అయితే దీనికి ఎంతో ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అప్పులు లేని జీవితం కోరుకునే వారి కోసం 10 ముఖ్యమైన ఆర్థిక అలవాట్లు, సూత్రాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అప్పుల్లో ఉన్నవారే కాకుండా, అసలు అప్పులే లేని వారు కూడా ఈ సూత్రాలను పాటించడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక కష్టాల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు.

  1. మీ సంపాదనకు లోబడే ఖర్చులు: ఆర్థిక క్రమశిక్షణకు మొదటి మెట్టు మీ ఆదాయానికి లోబడి ఖర్చు చేయడం. ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే, అందులో ఎంత పొదుపు చేస్తున్నామనేది ముఖ్యం. మీ అవసరాలకు తగినట్లుగా మాత్రమే ఖర్చు చేయండి. వాహనాల కొనుగోలు వంటి ఏదైనా పెద్ద ఖర్చు చేయాల్సి వస్తే, దానికి ముందే నెలవారీగా కొంత డబ్బును పొదుపుచేస్తూ, ఆ తర్వాతే దాన్ని కొనండి.
  2. బడ్జెట్ రూపకల్పన: నెల ప్రారంభంలోనే ఒక ఖచ్చితమైన బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి. మీ చేతిలో నుంచి ప్రతి రూపాయి ఎటు వెళ్తుందో లెక్క ఉండాల్సిందే. ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు ‘డేవ్ రామ్సే’ సూచించిన విధానం ప్రకారం.. నెలలో మీ మొత్తం ఆదాయం – మొత్తం ఖర్చులు = సున్నా (0) అవ్వాలి. అంటే ఆదాయంలో ప్రతి రూపాయిని బడ్జెట్ లో ఏదో ఒక విభాగానికి (ఖర్చులు, పొదుపు లేదా అప్పులు తీర్చడం) కేటాయించాలి.
  3. అత్యవసర నిధి ఏర్పాటు: జీవితంలో ఎప్పుడు ఎలాంటి కష్టం వస్తుందో ఎవరూ ఊహించలేరు. హఠాత్తుగా ఉద్యోగం పోవడం, అనారోగ్యం, లేదా వాహన రిపేర్లు వంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వేరొకరి దగ్గర అప్పు చేయకుండా ఉండాలంటే ‘అత్యవసర నిధి’ చాలా అవసరం. మొదట కనీసం రూ. 10,000 లతో ప్రారంభించి, ఆ తర్వాత మీకు 6 నెలల జీవన ఖర్చులకు సమానమైన మొత్తాన్ని ఈ ఎమర్జెన్సీ ఫండ్‌లో దాచుకోవాలి.
  4. అన్ని రకాల బీమాలు కలిగి ఉండాలి: హెల్త్ ఇన్సూరెన్స్ (వైద్య బీమా), లైఫ్ ఇన్సూరెన్స్ (జీవిత బీమా), వాహన బీమా, ప్రమాద బీమా వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లులను అప్పులు చేయకుండా కట్టడానికి ఇన్సూరెన్స్ ఎంతగానో సహాయపడుతుంది. ఇది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి కుప్పకూలకుండా రక్షణ కవచంలా నిలుస్తుంది.
  5. ఈ లోన్స్‌కు దూరంగా ఉండాలి: వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ అప్పులు, వాహన రుణాలు, నేటి తరం యువతను ఆకర్షిస్తున్న ‘బై నౌ పే లేటర్’ వంటి ఈఎంఐ ఆఫర్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. వీటి ద్వారా అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసి అప్పుల పాలవుతుంటారు. ఇల్లు కొనడానికి చేసే అప్పుకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే దానికి పన్ను మినహాయింపులు ఉంటాయి.
  6. ఆదాయంతో పాటు ఖర్చులు పెంచకండి: ఆదాయం పెరిగినప్పుడు దానికి సమానంగా ఖర్చులను పెంచడాన్ని ‘లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్’ అంటారు. జీతం పెరగగానే ఖరీదైన ఫోన్లు, బ్రాండెడ్ బట్టలు, తరచూ రెస్టారెంట్లకు వెళ్లడం వంటి అలవాట్లను నియంత్రించుకోవాలి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని, ఆ అదనపు ఆదాయాన్ని పొదుపు వైపు మళ్లించాలి.
  7. అదనపు ఆదాయ వనరుల సృష్టి: ఆర్థిక స్వేచ్ఛను త్వరగా సాధించాలంటే కేవలం ఒకే ఆదాయ వనరు (సింగిల్ శాలరీ) పై ఆధారపడకూడదు. అదనపు ఆదాయ వనరులను సృష్టించుకోవడంపై దృష్టిసారించాలి. పార్ట్ టైమ్ జాబ్ చేయడం, మీకున్న నైపుణ్యాలతో ఫ్రీలాన్సింగ్ చేయడం, లేదా పాసివ్ ఇన్‌కమ్ వచ్చేలా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇలా పెరిగిన అదనపు ఆదాయాన్ని అప్పులు తీర్చడానికి లేదా పెట్టుబడులకు ఉపయోగించాలి.
  8. ఓ పద్ధతిలో అప్పులు తీర్చడం: మీకు ఒకటి కంటే ఎక్కువ అప్పులు ఉంటే, వాటన్నింటినీ చిన్న మొత్తం నుండి పెద్ద మొత్తం వరకు ఒక క్రమ పద్ధతిలో జాబితా రాసుకోండి. అన్నింటికంటే చిన్న అప్పును వీలైనంత త్వరగా పూర్తిగా తీర్చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన అప్పులకు కనీస ఈఎంఐ మాత్రమే కట్టండి. ఒక చిన్న అప్పు తీరగానే, ఆ మిగిలిన డబ్బును తర్వాతి చిన్న అప్పును తీర్చడానికి ఉపయోగించండి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి, అప్పుల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది.
  9. భావోద్వేగపు కొనుగోళ్లను నివారించడం: చాలామంది ఒత్తిడిలో ఉన్నప్పుడో, లేదా ఆన్‌లైన్ సేల్స్ చూసినప్పుడో ఆకర్షితులై అవసరం లేని వస్తువులను కొనేస్తుంటారు. ఏదైనా వస్తువు కొనే ముందు..ఇది నా జీవితానికి నిజంగా అవసరమా? లేదా కేవలం కోరిక మాత్రమేనా? అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
  10. పిల్లల భవిష్యత్తు, రిటైర్మెంట్ కోసం ముందస్తు ప్రణాళిక: పిల్లలు ఎల్‌కేజీ (LKG) చదువుతున్నప్పటి నుండే వారి ఉన్నత చదువుల కోసం చిన్న మొత్తంలో పొదుపు చేయడం ప్రారంభించాలి. దీనివల్ల వారు కాలేజీకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సిన అవసరం రాదు. అలాగే, వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించడానికి మీ 20 లేదా 30 ఏళ్ల వయస్సు నుండే రిటైర్మెంట్ ఫండ్ కోసం పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి.

ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. దానికి నిరంతర సాధన, ఓపిక, కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం. పైన పేర్కొన్న సూత్రాలను మీ జీవితంలో అలవరుచుకోవడం ద్వారా అప్పుల భారం లేని ప్రశాంతమైన, సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.

Follow Us