AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెజ్ బర్గర్ ఆర్డర్ చేస్తే నాన్‌వెజ్ డెలివరీ.. బర్గర్ కింగ్, స్విగ్గీలకు భారీ జరిమానా..!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో జరిగిన పొరపాటు బర్గర్ కింగ్ ఇండియా, స్విగ్గీ సంస్థలకు భారీ జరిమానా తెచ్చిపెట్టింది. శాకాహార బర్గర్లు ఆర్డర్ చేయగా.. వాటి స్థానంలో మాంసాహార బర్గర్లు డెలివరీ చేయడంతో ఇద్దరు పిల్లలు వాటిని తిని అస్వస్థతకు గురయ్యారనే ఫిర్యాదుపై గురుగ్రామ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది.

వెజ్ బర్గర్ ఆర్డర్ చేస్తే నాన్‌వెజ్ డెలివరీ.. బర్గర్ కింగ్, స్విగ్గీలకు భారీ జరిమానా..!
Burger King, Swiggy Fined
Balaraju Goud
|

Updated on: Nov 20, 2026 | 1:01 PM

Share

గురుగ్రామ్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో జరిగిన పొరపాటు బర్గర్ కింగ్ ఇండియా, స్విగ్గీ సంస్థలకు భారీ జరిమానా తెచ్చిపెట్టింది. శాకాహార బర్గర్లు ఆర్డర్ చేయగా.. వాటి స్థానంలో మాంసాహార బర్గర్లు డెలివరీ చేయడంతో ఇద్దరు పిల్లలు వాటిని తిని అస్వస్థతకు గురయ్యారనే ఫిర్యాదుపై గురుగ్రామ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. సేవల్లో తీవ్ర లోపం జరిగిందని నిర్ధారిస్తూ రెండు సంస్థలూ సంయుక్తంగా రూ.72,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

వెజ్ బదులు నాన్‌వెజ్ బర్గర్లు సరఫరా!

గురుగ్రామ్‌లోని సెక్టార్‌-46కు చెందిన భగవాన్ దాస్ మంగ్లా 2021 ఏప్రిల్ 2న స్విగ్గీ యాప్ ద్వారా బర్గర్ కింగ్ నుంచి నాలుగు వెజిటేరియన్ బర్గర్లు ఆర్డర్ చేశారు. కుటుంబ సభ్యుల కోసం చేసిన ఈ ఆర్డర్‌లో శాకాహార బర్గర్లు రావాల్సి ఉండగా.. డెలివరీలో మాంసాహార బర్గర్లు వచ్చాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో మంగ్లా భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆహారాన్ని ప్యాకెట్‌లోనే ఉంచారు. అనంతరం పిల్లలు ప్యాకెట్ తెరిచి అందులోని బర్గర్లు తిన్నారు. అయితే వాటి రుచి వింతగా అనిపించడంతో పిల్లలకు వికారం, వాంతుల సమస్యలు మొదలయ్యాయని మంగ్లా ఆరోపించారు. ఆ సాయంత్రం ప్యాకెట్‌ను పరిశీలించగా.. అవి వెజ్ బర్గర్లు కాకుండా నాన్‌వెజ్ బర్గర్లని గుర్తించారు. దీంతో అదే రోజు స్విగ్గీ యాప్‌లో ఫిర్యాదు చేశారు.

తీర్థయాత్రతో పాటు రూ.25 వేల పరిహారం ఆఫర్?

ఈ ఘటన తమ శాకాహార కుటుంబ సభ్యుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని మంగ్లా పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు బర్గర్ కింగ్ ప్రతినిధి ఒకరు తప్పును అంగీకరించి, కోర్టు వెలుపల రాజీకి ప్రయత్నించారని ఆయన తెలిపారు. కుటుంబం కోరుకున్న ఒకటి లేదా రెండు ప్రాంతాలకు తీర్థయాత్రను స్పాన్సర్ చేయడంతో పాటు రూ.25,000 పరిహారం చెల్లిస్తామని కంపెనీ ప్రతిపాదించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను మంగ్లా తిరస్కరించారు. తనకు న్యాయం జరగాలంటూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయన రూ.60,000 పరిహారం కోరుతూ ఫిర్యాదు చేశారు.

కంపెనీల వాదనలు తోసిపుచ్చిన కమిషన్

కమిషన్ ఛైర్‌పర్సన్ సంజీవ్ జిందాల్, సభ్యులు జ్యోతి సివాచ్, ఖుష్విందర్ కౌర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఫిర్యాదుదారుడు సమర్పించిన అఫిడవిట్, ఆర్డర్ వివరాలు, ఇన్‌వాయిస్, స్విగ్గీ యాప్‌లో నమోదు చేసిన ఫిర్యాదు, ఇరు పక్షాల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను కమిషన్ పరిశీలించింది. ఈ పత్రాలు ఫిర్యాదుదారుడి వాదనలకు మద్దతుగా ఉన్నాయని, వాటిని ఖండించే ఆధారాలను బర్గర్ కింగ్, స్విగ్గీ సమర్పించలేకపోయాయని కమిషన్ పేర్కొంది. దీంతో రెండు సంస్థలూ సేవల్లో తీవ్ర లోపానికి బాధ్యులని నిర్ధారించింది. బాధితులకు రూ.50 వేలు పరిహారం.. రూ.22 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని కమిషన్ తన తీర్పులో పేర్కొంది.

ఈ మొత్తాన్ని చెల్లించేందుకు బర్గర్ కింగ్ ఇండియా, స్విగ్గీ సంస్థలకు 45 రోజుల గడువు ఇచ్చింది. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే, మొత్తం బకాయిపై చెల్లింపు జరిగే వరకు ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదేశాలను పాటించకపోతే వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం అమలు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఫిర్యాదుదారుడి మిగిలిన అభ్యర్థనలను కమిషన్ తిరస్కరించింది.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు హెచ్చరిక

ఈ తీర్పు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో ఆర్డర్‌ ఖచ్చితత్వం, ఆహార భద్రత, వినియోగదారుల అభిరుచులు, ఆహార ఎంపికలను గౌరవించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా వెజ్, నాన్‌వెజ్ ఆర్డర్ల విషయంలో చిన్న పొరపాటు కూడా వినియోగదారుల ఆరోగ్యం, వ్యక్తిగత నమ్మకాలు, మనోభావాలపై ప్రభావం చూపవచ్చు. వినియోగదారులు ఆర్డర్ చేసిన ఆహారమే సరైన విధంగా అందేలా రెస్టారెంట్లు, డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ కేసు గుర్తుచేస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us