ఆ రెండు సంఘటనలు జీవితంలో మర్చిపోలేను.. భయంతో చెమటలు పట్టాయి : సుబ్బరాజ్
నటుడు సుబ్బరాజు తన సినిమా ప్రయాణంలో మాత్రమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని మరచిపోలేని, భయానక క్షణాలను ఎదుర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎదుర్కొన్న రెండు సంఘటనలను వివరించారు, అవి ఆయనకు చెమటలు పట్టించాయని అన్నారు. ఇంతకూ సుబ్బరాజ్ చెప్పిన భయంకరమైన సంఘటనలు ఏంటో చూద్దాం.!

మొదటి సంఘటన జూబ్లీహిల్స్‌లోని కావూరి హిల్స్‌లో ఆయన నివాసం ఉంటున్నప్పుడు జరిగిందట. పక్కనే అంబేద్కర్ యూనివర్సిటీ కొండ ఉన్న ప్రాంతం అది. ఆయన శ్రీనివాస టవర్స్ అనే ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్‌లో ఒంటరిగా నివసించేవారట. పై అంతస్తు పూర్తిగా లాక్ చేసి ఉండేది, క్రింద ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉండేవి. ఒకరోజు రాత్రి 11-11:30 గంటల సమయంలో ఇంటికి వచ్చి, స్నానం చేసి, తన బెడ్రూమ్లో ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటున్నారట. ఆయన బెడ్‌పై కూర్చుని ఉండగా, ల్యాప్‌టాప్ తెర ముందు, పక్కన విజన్‌లో ఒక మనిషి తల పైకి లేచి కిందకు వెళ్లడం చూశారట. శబ్దం లేకపోవడంతో అది ఇల్యూషన్ అనుకున్నారట, కానీ గుండెదడ పెరిగింది. ఒక్క నిమిషంలో మళ్లీ అదే విధంగా ఒక తల పైకి లేచి కిందకు వెళ్లిందట. దీంతో సుబ్బరాజుకు తీవ్ర భయం వేసిందట.
తన బెడ్ కింద ఏదో ఉందని గ్రహించిన ఆయన, అది దొంగనా లేక మరేదైనా అని ఆలోచించారట. తన ఇంట్లో దొంగలకు దొరికేవి ఏమీ లేవని, ఒకవేళ దొంగ అయితే తాను స్నానం చేసేటప్పుడే పారిపోయేవారని ఆయన అనుకున్నారట. తన ఇంట్లో తాళం కేవలం తన దగ్గర మాత్రమే ఉంటుందని, ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అని సందేహించారట. భయంతో, కర్రల కోసం చూశారు, కానీ తన ఊరి ఇంట్లో ఉన్నట్టుగా పెద్ద కర్రలు లేవు. వెంటనే బెడ్ ఎక్కి నిలబడి, బెడ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లి కిందకు చూశారు, కానీ ఏమీ కనపడలేదు. వెంటనే బెడ్ నుంచి దూకి, బెడ్రూమ్ డోర్ వేసి, బయటికి వచ్చి హాల్లో లైట్ వేసి, తలుపు కింద గ్యాప్ నుంచి బెడ్ కిందకు చూశారట. అక్కడ ఒక పెద్ద కోతి కనిపించిందట. కోతిని చూడగానే ఆయనకు పెద్ద రిలీఫ్ లభించింది. తర్వాత, పై అంతస్తులోని రెండో బెడ్రూమ్ తలుపు తెరిచి ఉండటం చూశారట. బహుశా ఉదయం పనివాళ్ళు శుభ్రం చేసి మర్చిపోయి ఉండవచ్చని, పక్కన కొండలు ఉండటం వల్ల కోతి లోపలికి ప్రవేశించి, బెడ్ కింద దాక్కుందని ఆయనకు అర్ధమైందట. ఒక కర్ర తీసుకుని కోతిని బయటకు తరిమేశారట. ఈ సంఘటన భయంకరంగా మొదలైనా, చివరకు తమాషాగా మారిందని ఆయన చెప్పారు.
రెండో సంఘటన ఆయనకు నిజంగా చెమటలు పట్టించిందట. ఇది కొండాపూర్‌లోని తన పాత ఇంట్లో జరిగిందట. సుబ్బరాజు ఉన్న అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో తన స్నేహితుడు సందీప్ నివసించేవాడు. ఒకరోజు రాత్రి 9-9:30 గంటల ప్రాంతంలో సుబ్బరాజు తన ఇంట్లో ఉండగా, సందీప్ ప్రసాద్స్ ఐమాక్స్ నుంచి ఫోన్ చేశాడు. తన భార్య, చిన్న పాప, పనిపిల్ల ఇంట్లో ఉన్నారని, అరగంట నుంచి ఫోన్ చేస్తున్నా ఎవరూ తీయడం లేదని, ఒకసారి తలుపు కొట్టి చూడగలరా.? అని అడిగాడట. ఆయన కంగారు పడుతున్నారని తెలుసుకుని సుబ్బరాజు వెంటనే స్నేహితుడి ఇంటికి వెళ్లారట. తలుపు కొట్టారు, కిటికీ తలుపులు గుద్దారు, పక్క సన్ షేడ్ల మీదకి ఎక్కి కూడా ప్రయత్నించారట, కానీ ఎవరూ స్పందించలేదట. లోపల మూడు సంవత్సరాల చిన్న పాప ఉంది. తలుపులన్నీ లాక్ చేసి ఉన్నాయి.
ఈ పరిస్థితిలో సుబ్బరాజు మైండ్ ఫంక్షన్ ఆగిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదట. భారీ టేకు చెక్కతో చేసిన డోర్లు పగలగొట్టడం అంత సులువు కాదు. పైకి, కిందకు తిరుగుతూ, అనేక ప్రయత్నాలు చేశారట. పావుగంట పాటు లోపల ఏసీ వేసుకుని నిద్రపోయి ఉండొచ్చా అని కూడా ఆలోచించారట. దాదాపు అరగంట వేచి చూసిన తర్వాత కూడా రెస్పాన్స్ లేకపోవడంతో తీవ్ర టెన్షన్ పెరిగింది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి, కిందకు వెళ్లి భవనం మెయిన్ పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. మళ్ళీ స్నేహితుడికి ఫోన్ చేసి, మెయిన్ ఆఫ్ చేశానని చెప్పి, మరోసారి తలుపు కొట్టమని సూచించారు. అప్పుడు పనిపిల్ల నిద్రలేచి తలుపు తీసింది. ఈ మొత్తం నాటకం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. లోపల చిన్న పాప నిద్రపోతోంది, పనిపిల్ల తన గదిలో ఏసీ ఆన్ చేసి నిద్రపోతోంది. ఏసీ శబ్దాల వల్ల వారికి బయటి శబ్దాలు వినిపించలేదని, ల్యాండ్‌లైన్ బయట ఉండటం, సెల్ ఫోన్ సైలెంట్లో ఉండటం వల్ల కాల్స్ కూడా వినిపించలేదని తెలిసింది. ఈ 45 నిమిషాల అనుభవాన్ని సుబ్బరాజు నరకంతో పోల్చారు. అలాంటి భయం ఎవరికీ రావద్దని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
