AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ సర్కార్ కూలిపోతుందా..! బాంబ్ పేల్చిన స్టాలిన్.. ముందస్తు ఎన్నికలపై..

దళపతి విజయ్ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు అంటూ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బాంబ్ పేల్చారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ క్షేత్రస్థాయి శ్రేణులకు పిలుపునిచ్చారు. అసలు విజయ్ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి ముప్పు పొంచి ఉంది? 25 మంది రెబెల్ ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి? తమిళనాడు పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి.? అనే విషయాలు తెలుసుకుందాం..

విజయ్ సర్కార్ కూలిపోతుందా..! బాంబ్ పేల్చిన స్టాలిన్.. ముందస్తు ఎన్నికలపై..
Mk Stalin On Vijay Govt
Krishna S
|

Updated on: May 19, 2026 | 4:54 PM

Share

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని, కాబట్టి పార్టీ శ్రేణులంతా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది. డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో మాట్లాడిన స్టాలిన్, రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఏ క్షణంలోనైనా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చని జోస్యం చెప్పారు. ఈ ఓటమి తాత్కాలికమేనని, గతంలో ఎదురైన ఎదురుదెబ్బల నుండి డీఎంకే ఎలా పుంజుకుందో గుర్తుచేస్తూ, రాబోయే రోజుల్లో తమ పార్టీ మళ్లీ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మనమంతా సన్నద్ధంగా ఉండి తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ టీవీకే సొంతంగా 107 సీట్లను కలిగి ఉంది. మిత్రపక్షమైన కాంగ్రెస్ ఐదు సీట్లతో పాటు చెరో రెండు సీట్లు ఉన్న మరో నలుగురు మిత్రపక్షాల మద్దతుతో ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వం మెజారిటీని కాపాడుకుంది. వీటికి తోడు గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది రెబెల్ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడా ముఖ్యమంత్రి విజయ్‌కు లభించింది. అయితే ఈ మెజారిటీ ఎక్కువ కాలం నిలవదని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి మిత్రపక్షాలు ఏ క్షణంలోనైనా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందని, లేదా తిరుగుబాటు చేసిన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ గానీ, కోర్టులు గానీ అనర్హత వేటు వేస్తే విజయ్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ అస్థిరతలో పడటం ఖాయమని డీఎంకే విశ్లేషిస్తోంది.

మరోవైపు డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన స్టాలిన్, తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ తమిళనాడులో సూర్యుడు (డీఎంకే చిహ్నం) ఎప్పటికీ అస్తమించడు అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఓటమికి పూర్తి వ్యక్తిగత బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన ఆయన, తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో కూడా సీటు కోల్పోవడంపై స్పందిస్తూ, ఈ వైఫల్యాలకు తనదే బాధ్యత అని చెప్పారు. ఇదే సమయంలో పార్టీ డిజిటల్ వ్యూహాన్ని మార్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సోషల్ మీడియాలో విజయ్ నేతృత్వంలోని టీవీకే చాలా ముందుందని పరోక్షంగా అంగీకరిస్తూ.. ఒకప్పుడు తాము టీ దుకాణాలలో చేసిన క్షేత్రస్థాయి రాజకీయాలను, ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై మరింత బలంగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ ఘోర పరాజయానికి గల కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించి, ప్రజల నుంచి ప్రత్యక్షంగా అభిప్రాయాలను సేకరించేందుకు గానూ స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడంతో పాటు పార్టీ ఎక్కడెక్కడ తన సాంప్రదాయ మద్దతును కోల్పోయిందో గుర్తించేందుకే ఈ కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం, ద్రవిడ వర్గానికి చెందిన డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రతిపక్షంలోకి నెట్టివేయడంతో రాష్ట్ర రాజకీయాలపై ద్రవిడ పార్టీలకు ఉన్న 59 ఏళ్ల సుదీర్ఘ ఆధిపత్యానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. అయితే తాము ఈ రాజకీయ పరిణామాలకు ఏమాత్రం కలవరపడటం లేదని, విజయ్ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతుందని టీవీకే వర్గాలు ధీమాగా ఉన్నాయి.

Follow Us