వారికి అసలు లోన్లు ఇవ్వకండి! NBFCలకు RBI స్ట్రాంగ్ వార్నింగ్!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCs) రుణ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. పాత రుణాలను సకాలంలో చెల్లించని కస్టమర్లకు కొత్త రుణాలు ఇవ్వడాన్ని 'ఎవర్‌గ్రీనింగ్'గా పేర్కొంటూ RBI దీనిపై వివరణ కోరింది. IndAS, ECL మోడల్ ద్వారా ముందస్తు రిస్క్ గుర్తింపు తప్పనిసరి.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFCs) రుణ విధానాలపై కఠినంగా స్పందించింది. పాత రుణాలను సకాలంలో చెల్లించని కస్టమర్లకు కొత్త రుణాలు ఎందుకు మంజూరు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని కనీసం మూడు NBFCలను ఆర్‌బిఐ ప్రశ్నించినట్లు సమాచారం. వార్షిక తనిఖీలలో, కొంతమంది కస్టమర్లు వాహన రుణాల్లో డిఫాల్ట్ అయినప్పటికీ, వారికి ఆస్తి లేదా గృహ రుణాల పేరిట కొత్త రుణాలు మంజూరు చేసిన ఘటనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే కొత్త రుణాలను పూర్తిగా నిరాకరించాలని RBI సూచించడం లేదు. ఇది కంపెనీల వ్యాపార నిర్ణయం కావచ్చని స్పష్టం చేసింది. కానీ, ఎలాంటి పరిస్థితుల్లో డిఫాల్ట్ చేసిన కస్టమర్లకు కొత్త రుణాలు ఇవ్వాలో, అవి “ఎవర్‌గ్రీనింగ్” కోసం ఉపయోగించబడకుండా ఎలా నిరోధించాలో బోర్డు ఆమోదించిన స్పష్టమైన విధానం ఉండాలని ఆర్‌బిఐ పేర్కొంది.
ఎవర్‌గ్రీనింగ్..
సమస్యాత్మక రుణగ్రహీతకు పాత రుణాన్ని చెల్లించేందుకు కొత్త రుణం ఇవ్వడాన్ని ఎవర్‌గ్రీనింగ్ అంటారు. దీని వల్ల సంస్థ బ్యాలెన్స్ షీట్‌లో మొండి రుణాల అసలు స్థితి దాచబడే ప్రమాదం ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, రుణ వాయిదా 90 రోజులు ఆలస్యమైతే అది NPA (నిరర్థక ఆస్తి)గా వర్గీకరించబడుతుంది. SMA వర్గీకరణ ఎలా ఉంటుందంటే..
- మొదటి డిఫాల్ట్ తర్వాత ఖాతా – SMA-0
- 31–60 రోజుల ఆలస్యం – SMA-1
- 61–90 రోజుల ఆలస్యం – SMA-2
NBFC అంతర్గత రుణ విధానంలో ఈ అంశాలు స్పష్టంగా లేకపోతే ఆర్‌బిఐ చర్యలు తీసుకునే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రూ.250 కోట్లకు పైగా నికర విలువ కలిగి, IndAS ప్రమాణాలు అనుసరిస్తున్న NBFCలపై ఈ నిబంధనలు మరింత కఠినంగా వర్తించవచ్చు. IndAS కింద ముందస్తుగా రిస్క్‌ను గుర్తించి ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుంది. కేవలం 30 రోజుల ఆలస్యం జరిగినా మొత్తం రుణంపై సంభావ్య నష్టాన్ని అంచనా వేయాలి. దీనిని ECL (Expected Credit Loss) మోడల్ అంటారు. ఇది డిఫాల్ట్ జరిగేవరకు వేచి చూడకుండా ప్రారంభ దశలోనే ప్రమాదాన్ని గుర్తిస్తుంది. మొత్తంగా NBFCలు మెరుగైన పాలన, పారదర్శకత, రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించేలా చేయడం ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో మొండి రుణాలను దాచిపెట్టే పరిస్థితులు తలెత్తకుండా ఈ చర్యలు ఉపకరిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
