AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warren Buffett: సంపద సృష్టి చాలా ఈజీ.. అపర కుబేరుడు చెప్పిన 5 రూల్స్..!

Warren Buffett's Investing Rules: ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, అపర కుబేరుడు వారెన్ బఫెట్ విజయానికి కారణమైన ఐదు కీలక ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాలు నేటికీ పెట్టుబడిదారులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మార్కెట్‌ రేపు ఎలా ఉండబోతుందన్న అంశంపై ఎక్కువ ఆలోచన చేయకుండా మంచి కంపెనీలను ఎంచుకోవడంపై దృష్టిసారించాలని ఆయన సూచిస్తున్నారు. అలాగే దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టడం, చక్రవడ్డీ శక్తిని ఉపయోగించుకోవడం వంటి నియమాలను పాటిస్తే సంపద సృష్టి సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సంపద సృష్టితో ఆర్థిక స్వేచ్ఛ సాధించాలని కలలుగనే ప్రతి ఒక్కరూ ఈ సూత్రాలను తెలుసుకోవడం అవసరం.

Warren Buffett: సంపద సృష్టి చాలా ఈజీ.. అపర కుబేరుడు చెప్పిన 5 రూల్స్..!
Warren Buffet Investment RulesImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: May 28, 2026 | 4:24 PM

Share

ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరైన వారెన్ బఫెట్ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా స్టాక్ మార్కెట్లో అద్భుతమైన విజయాలను సాధించిన ఆయన పెట్టుబడి సూత్రాలు నేటికీ లక్షలాది మంది ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. దీర్ఘకాలంలో స్థిరమైన సంపదను సృష్టించాలంటే అపర కుబేరుడైన వారెన్ బఫెట్ సూచించిన ఐదు ముఖ్యమైన నియమాలను అర్థం చేసుకోవడం అవసరం. సంపద సృష్టికి వారెన్ బఫెట్ చూసించిన ఆ ఐదు సలహాలను ఇప్పుడు చూద్దాం..

1. మార్కెట్‌ను అంచనా వేయడానికి ప్రయత్నించకండి..

రేపు మార్కెట్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనే ప్రశ్నలకు ఎవరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేరు. వారెన్ బఫెట్ ప్రకారం రేపు లేదా వచ్చే నెల మార్కెట్ ఎలా ఉండబోతుందన్న ఆలోచన పూర్తిగా వృధా ప్రయాస. అందుకే స్వల్ప కాలిక మార్కెట్ హెచ్చుతగ్గులపై దృష్టి పెట్టకుండా.. మీరు పెట్టుబడి పెట్టే కంపెనీల వ్యాపార సామర్థ్యంపై నమ్మకంతోనే పెట్టుబడి పెట్టాలని బఫెట్ సూచిస్తారు.

2. విలువైన కంపెనీల్లో పెట్టుబడి

వాల్యూ ఇన్వెస్టింగ్ బఫెట్ విజయానికి ప్రధాన కారణం. స్టాక్ మార్కెట్లో వివిధ రకాల తాత్కాలిక కారణాల వల్ల తక్కువ ధరకు లభిస్తున్న మంచి కంపెనీలను గుర్తించి.. వాటిలో పెట్టుబడి పెట్టాలి. తద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు. సదరు కంపెనీ వ్యాపారం లాభాలు ఇస్తుందా? ఆ సంస్థ మేనేజ్‌మెంట్ సమర్థవంతుల చేతిలో ఉందా? ఆ కంపెనీ షేర్ దాని నిజమైన విలువకంటే తక్కువ ధరకు లభిస్తోందా? అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని అందులో పెట్టుబడి పెట్టాలి.

3. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి

స్టాక్ మార్కెట్‌లో త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కంటే, దీర్ఘకాలిక పెట్టుబడులు మెరుగైన ఫలితాలు ఇస్తాయని బఫెట్ నమ్మకం. రోజువారీ ధరల మార్పులకు ప్రభావితమవకుండా ఓపికతో ఉండటం అవసరం. “మీరు ఒక స్టాక్‌ను 10 సంవత్సరాల పాటు ఉంచుకునే నమ్మకం లేకపోతే, దానిని 10 నిమిషాల పాటు కూడా ఉంచుకోవడానికి ఆలోచించకండి” అని బఫెట్ అంటారు. కొన్ని రోజులు లేదా నెలల్లో లాభాలు ఆశించకుండా కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగించాలని సూచిస్తున్నారు.

4. మీ రాబడిని మార్కెట్‌తో పోల్చండి

మీ పెట్టుబడులు ఎంత మేరకు విజయవంతమవుతున్నాయో తెలుసుకోవడానికి వాటిని నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ వంటి సూచీలతో పోల్చి చూడాలి. మీ పోర్ట్‌ఫోలియో మార్కెట్ సగటు కంటే మెరుగైన రాబడి ఇస్తుందో లేదో పోల్చి చూసుకోవాలి. మార్కెట్‌ సగటును అధిగమించలేకపోతే తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని బఫెట్ సలహా ఇచ్చారు.

5. చక్రవడ్డీ శక్తిని ఉపయోగించుకోండి

పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలను మళ్లీ పెట్టుబడిగా మార్చడం ద్వారా మీ సంపద వేగంగా పెరుగుతుంది. చక్రవడ్డీ శక్తే వారెన్ బఫెట్ సంపద వెనుక ఉన్న ప్రధాన రహస్యం. వారెన్ బఫెట్ సాధించిన సంపదలో అత్యధిక భాగం ఆయనకు 50 లేదా 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాతే లభించింది. అందుకే పెట్టుబడి రంగంలో ఓపిక చాలా ముఖ్యమని బఫెట్ సలహా.

ప్రధానంగా మంచి కంపెనీలను ఎంచుకోవడం, సరైన ధరకు కొనుగోలు చేయడం, ఓపికతో దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించడం వారెన్ బఫెట్ విజయ సూత్రం. ఈ ఐదు నియమాలను పాటిస్తే మీరు కూడా మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

Follow Us