AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Promissory Note: ప్రామిసరీ నోటులో ఈ తప్పులు చేస్తే.. ఇక మీ డబ్బులు వదిలేసుకోవాల్సిందే..

అప్పు ఇచ్చేటప్పుడు కేవలం నమ్మకమే సరిపోదు, పక్కాగా ప్రామిసరీ నోటు ఉండాలి. కానీ ఆ ప్రామిసరీ నోటు రాసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కించినా ఫలితం లేకుండా చేస్తాయి. సంతకం ఒక్కటి ఉంటే సరిపోతుందా? స్టాంపు ఎక్కడ ఉండాలి? నగదు రూపంలో అప్పు ఇస్తే వచ్చే చిక్కులేంటి?

Promissory Note: ప్రామిసరీ నోటులో ఈ తప్పులు చేస్తే.. ఇక మీ డబ్బులు వదిలేసుకోవాల్సిందే..
Promissory Note
Ravi Kiran
|

Updated on: May 05, 2026 | 5:17 PM

Share

మనం మనసున్న వాళ్లం, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడానికి ముందుంటాం. కానీ ఆర్థిక లావాదేవీల దగ్గరికి వచ్చేసరికి ఆ మంచితనమే ఒక్కోసారి శాపంగా మారుతుంది. “రేపు ఇస్తాను.. మావాడే కదా” అని రాసివ్వని అప్పులు, లేదా సరిగ్గా రాయించుకోని ప్రామిసరీ నోట్లు చివరకు కోర్టుల చుట్టూ తిప్పుతాయి. అసలు ఒక ప్రామిసరీ నోటు రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. అప్పు తీసుకునే వ్యక్తితో ఖాళీ నోటుపై కేవలం సంతకం మాత్రమే చేయించుకుంటారు. “తర్వాత మిగిలినవి రాసుకోవచ్చులే” అనుకుంటే అది మీ పాలిట యమపాశం అవుతుంది. రేపు కోర్టులో ఆ వ్యక్తి “నేను సంతకం మాత్రమే చేశాను, ఆ పైన ఉన్న రాత నాది కాదు” అని వాదిస్తే, ఫోరెన్సిక్ పరీక్షలో సంతకం పాతది, రాత కొత్తది అని తేలితే ఆ నోటు చెల్లదు. అందుకే సాధ్యమైనంతవరకు అప్పు తీసుకునే వ్యక్తి చేతనే మొత్తం నోటును రాయించడం ఉత్తమం.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పు ఇచ్చేటప్పుడు ‘కారణం’ రాయడం. కేవలం “అప్పుగా తీసుకున్నాను” అని కాకుండా “కుటుంబ అవసరాల నిమిత్తం” అని రాయించాలి. ఎందుకంటే, ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే, ఆ అప్పును అతని వారసుల నుంచి వసూలు చేయడానికి ఈ ఒక్క మాట చాలా కీలకం. వ్యక్తిగత ఖర్చుల కోసం తీసుకుంటే వారసులకు బాధ్యత ఉండదు. కానీ కుటుంబం కోసం తీసుకుంటే వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇక ప్రస్తుత డిజిటల్ కాలంలో నగదు రూపంలో లక్షల రూపాయలు ఇవ్వడం కంటే Google Pay, PhonePe లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపడం అత్యంత సురక్షితం. బ్యాంక్ రికార్డులే మీ అప్పుకు అతిపెద్ద సాక్ష్యం. అలాగే ప్రామిసరీ నోటు కాలపరిమితి మూడేళ్లు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఆ లోపు అప్పు తీరకపోతే, మళ్ళీ కొత్త నోటు రాయించుకోవాలి లేదా కోర్టును ఆశ్రయించాలి. స్టాంపు మీద సంతకం, సాక్షుల సంతకాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం వల్ల మీ డబ్బుకు చట్టపరమైన రక్షణ ఉంటుంది.

Follow Us