ITR Filing: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారా..? లేకపోతే ఇబ్బందులే.. గడువు దగ్గర పడుతోంది
ITR Filing: 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను..
ITR Filing: 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు వెంటనే చేయడం మంచిది. గడువు ముగిసిన తర్వాత దాఖలు చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారని నివేదికలు చెబుతున్నాయి. జూలై 2, 2022న ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడంలో కొంతమంది పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆదాయ శాఖ తెలిపింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు సమస్యలను ఎదుర్కొవచ్చు.. అందుకు మమ్మల్ని క్షమించండి.. అంటూ తెలిపింది. జూలై 2, 2022న ఆదాయపు పన్ను శాఖ చేసిన ట్వీట్‌లో ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లు దాఖలు చేశారని తెలిపింది. ఇంకా రిటర్న్ దాఖలు చేయకుంటే, వెంటనే రిటర్న్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను అభ్యర్థించింది.
గత రెండు అసెస్‌మెంట్ సంవత్సరాలైన 2020-21, 2021-22 కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. కానీ 2020-21లో, కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీని పొడిగించారు. ఆపై 2021-22లో కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌లో రిటర్నులు దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా, చాలా మంది దశలవారీగా, చివరి తేదీ 31 డిసెంబర్ 2021 వరకు పొడిగించబడింది. అయితే, 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌లో ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ఫైల్ చేసే తేదీని పొడిగించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. అందుకే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడంలో ఆలస్యం చేయవద్దు. 4 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా తమ రిటర్నులు దాఖలు చేయలేదు.
ఆలస్యంగా దాఖలు చేసినందుకు జరిమానా:
మీరు గడువు తేదీ తర్వాత అంటే జూలై 31, 2022 తర్వాత, డిసెంబర్ 31, 2022లోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసినట్లయితే అప్పుడు రూ. 5,000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే అప్పుడు రూ.1,000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..