Adani Group: రూ. 2 లక్షల కోట్లకుపైగా అప్పుల్లో అదానీ గ్రూప్.. డేంజర్ బెల్స్ మోగిస్తోన్న క్రెడిట్ సైట్స్ నివేదిక..
చాలా అప్పుల్లో ఉన్నప్పటికీ, సంస్థ నిరంతరం విస్తరిస్తుండడం గమనార్హం. అనేక ఇతర కంపెనీలను కొనుగోలు చేస్తోంది. ఇటీవల, అదానీ గ్రూప్ నేతృత్వంలోని కంపెనీ AMG మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Adani Group: ప్రపంచంలో నాలుగో, భారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మీడియా కథనం ప్రకారం, అదానీ గ్రూప్‌కు రూ.2.2 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంట. చాలా అప్పుల్లో ఉన్నప్పటికీ, సంస్థ నిరంతరం విస్తరిస్తుండడం గమనార్హం. అనేక ఇతర కంపెనీలను కొనుగోలు చేస్తోంది. ఇటీవల, అదానీ గ్రూప్ నేతృత్వంలోని కంపెనీ AMG మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ తన విస్తరణను ఆపకపోతే ఆ సంస్థ మునిగిపోయే దశకు చేరుకుంటుందా? కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం..
అదానీ గ్రూప్ వాల్యుయేషన్ ఎంతంటే?
BSE ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ ₹19.47 లక్షల కోట్లతో భారతదేశంలో రెండవ అతిపెద్ద కంపెనీగా నిలిచింది. BSEలో జాబితా మేరకు 7 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను జోడించడం ద్వారా ఈ డేటా విడుదల చేసింది. అదానీ గ్రూప్‌లో బీఎస్‌ఇలో నమోదు కాని అనేక ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి. భారతదేశం కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ కంపెనీ విస్తరించిన సంగతి తెలిసిందే.




అదానీ గ్రూప్ ఎన్ని రంగాల్లో పనిచేస్తుంది?
ఈ కంపెనీ గనులు, పవర్ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, ఓడరేవులు, రక్షణ రంగాలలో కూడా పనిచేస్తోంది. కంపెనీ ప్రస్తుతం పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్స్, అల్యూమినియం ఉత్పత్తితో సహా తనకు అనుభవం లేని అనేక రంగాల్లోకి అడుగుపెట్టింది.
అదానీ గ్రూప్ ఎన్ని కోట్ల అప్పుల్లో ఉంది?
ఫిచ్ గ్రూప్‌కు చెందిన క్రెడిట్‌సైట్స్ నివేదిక ప్రకారం, అదానీ గ్రూప్ త్వరలో తన రుణాన్ని తగ్గించుకోకపోతే, దానిలోని చాలా కంపెనీలు డిఫాల్ట్ కావచ్చు. స్టాక్ మార్కెట్‌లో నమోదైన 7 కంపెనీల్లో 6 కంపెనీలకు రూ.2.2 లక్షల కోట్ల అప్పులు ఉన్నారయంట.
ఇందులో రూ.0.35 లక్షల కోట్లు ప్రమోటర్ల నుంచి వివిధ సంస్థల నుంచి తీసుకోగా, రూ. 0.21 లక్షల కోట్లు స్వల్పకాలిక రుణం తీసుకుంది. వీటిని కంపెనీ త్వరలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ వద్ద దాదాపు రూ.0.27 లక్షల కోట్ల నగదు లేదా దానికి సమానమైన నగదు ఉంది. అంటే కంపెనీ నికర అప్పు రూ.1.37 లక్షల కోట్లుగా తేల్చాయి.
ఇది కంపెనీపై ఎంత ప్రభావం చూపుతుంది?
ఒక కంపెనీ రుణంలో ఉన్నప్పుడు, కంపెనీ సంపాదనలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించే దిశగా వెళుతుంది. కాబట్టి, అది నేరుగా కంపెనీ మార్జిన్‌లను ప్రభావితం చేస్తుంది. ఇది కంపెనీ వృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆ కంపెనీపై పెట్టుబడిదారుల విశ్వాసం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఏదైనా కారణం వల్ల ఆదాయాలు తగ్గితే, కంపెనీ దివాలా తీసే ప్రమాదం కూడా ఉంది. కంపెనీ దివాళా తీస్తే, దానితో సంబంధం ఉన్న లక్షలాది మంది ఉపాధిలో సంక్షోభం ఏర్పడుతుంది. అలాగే పెట్టుబడిదారుల డబ్బుకు కూడా ఆవిరైపోతుంది.




