GST: జీఎస్టీ తగ్గినా..ఈ 24 వస్తువుల రేట్లు తగ్గలేదు.. అసలు కథ ఏంటంటే..?
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించిన తర్వాత సామాన్యులకు నిజంగానే ఊరట లభించింది. ఇటీవల కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చాక, మొత్తం 54 గృహోపకరణాల ధరలను ప్రభుత్వం పర్యవేక్షించగా.. అందులో 30 వస్తువుల ధరలు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా తగ్గాయని తేలింది. అయితే 24 వస్తువుల ధరలు మాత్రం ఆశించినంతగా తగ్గలేదు.

జీఎస్టీ సంస్కరణలతో కేంద్రం సామాన్యులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీపావళికి ముందే జీఎస్టీ తగ్గింపుతో చాలా వాటి ధరలు తగ్గాయి. జీఎస్టీ తగ్గించాక నిజంగానే వస్తువుల రేట్లు తగ్గాయా..? అనే విషయంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మొత్తం 54 గృహోపకరణాల ధరల్లో మార్పులను పర్యవేక్షించగా.. అందులో 30 వస్తువుల ధరలు ఊహించిన దాని కంటే ఎక్కువగా తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ధరలు తగ్గింది వీటికే
దేశవ్యాప్తంగా ఉన్న 21 సెంట్రల్ జీఎస్టీ జోన్ల నుండి అందిన సమాచారం ప్రకారం.. ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, టమాటో కెచప్, చీజ్, కండెన్స్‌డ్ మిల్క్, జామ్, సిమెంట్ వంటి 30 వస్తువుల ధరలు అంచనాలకు మించి తగ్గాయి. ఆహార పదార్థాలలో, డ్రైఫ్రూట్స్, చీజ్, జామ్, టొమాటో కెచప్ వంటి వాటిపై జీఎస్టీని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడంతో ధరలు గణనీయంగా తగ్గాయి. అలాగే షాంపూ, టూత్ బ్రష్‌లు, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్ వంటి సౌందర్య సాధనాలు, కళ్లద్దాలు, ఏసీ యంత్రాలు, టీవీ సెట్‌లు, కిచెన్‌వేర్ ధరలు కూడా బాగా తగ్గాయి.
తగ్గాల్సిన వస్తువులపై ఫోకస్
జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనం ఇంకా వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా 24 వస్తువుల రేట్లు తగ్గలేదు. వీటిలో నోట్‌బుక్‌లు, చాక్లెట్లు, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, పెన్సిళ్లు, థర్మామీటర్లు, సైకిళ్లు వంటి నిత్యావసరాలు ఉన్నాయి. నెయ్యి, బిస్కెట్లు, ఐస్ క్రీం, కేక్‌ల ధరలు కూడా ఊహించిన దానికంటే తక్కువగా తగ్గాయి.
కంపెనీలతో కలిసి..
ధరలు తగ్గని వస్తువులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ విషయంలో కంపెనీలతో కలిసి పనిచేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు ప్రయోజనాలను అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.
మరినని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




