Gas Cylinders: గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. ఇది ఒక్కటి ఉంటే గ్యాస్ అయిపోతుందనే ఇబ్బందే ఉండదు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లలో కొరత ఇంకా కొనసాగుతోంది. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అక్రమార్కులు విక్రయిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ స్టవ్‌పై చర్చ నడుస్తోంది. ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం క్రమంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా వంట పద్దతులపై దృష్టి పెడుతున్నారు. ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లు లాంటి వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఎల్పీజీ కొరత వచ్చినా ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఆఫ్రికన్ మోడల్‌ను దేశంలో కూడా అమలు చేయాలని కొంతమంది కోరుతున్నారు. దీని వల్ల వంట గ్యాస్ సమస్య తొలగిపోతుందని అంటున్నారు. ఎల్పీజీ గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఇది సహాయడపుతుందని చెబుతున్నారు.
ఇథనాల్ వంట సొల్యూషన్స్
ఆఫ్రికా దేశాల్లో ఇథనాల్ వంట సొల్యూషన్స్ ఉపయోగిస్తున్నారు. ఇథనాల్‌ను వంట ఇంధనంగా వాడుతున్నారు. ఇథనాల్‌తో పనిచేసే స్టవ్‌లను రూపొందించారు. ఆఫ్రికా, టాంజానియా, కెన్యా, ఇథిమోపియా వంటి దేశాలు ఇథనాల్‌ను వంట కోసం ఉపయోగిస్తున్నాయి. దీని వల్ల ఎల్పీజీ అవసరం ఉండదు. ఎల్పీజీ బదులుగా స్థానికంగా లభించే ఇథనాల్‌ను వంట కోసం వినియోగిస్తున్నారు. టాంజానియా 1.10 లక్షల ఇథనాల్ స్టవ్‌లను ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకోగా.. ఇథిమోపియా ప్రాజెక్ట్ గైయా చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2 లక్షల ఇళ్లల్లో ఇథనాల్ స్టవ్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక కెన్యా కూడా ఇథనాల్ వంట మార్గంపై వేగంగా అడుగులు వేస్తోంది. 15 లక్షల కుటుంబాలకు ఇథనాల్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇక మాలి, నైజిరియాలు కూడా 5 లక్షల ఇథనాల్ స్టవ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. దీంతో జనాభా ఎక్కువా ఉన్న భారత్‌లో కూడా ఇథనాల్ వంట మార్గాన్ని ప్రోత్సహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
భారత్‌కు అనేక లాభాలు
భారత్ కూడా ఇథనాల్ వినియోగిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడటం తగ్గిపోతుంది. ప్రస్తుతం 60 శాతం ఎల్పీజీని విదేశాల నుంచి భారత్‌కు సరఫరా అవుతుంది. అదే ఇథనాల్ వాడితే భారత్ దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. ఇక భారత్ ఎల్పీజీపై సామాన్యులకు సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీలు లేకపోతే రూ.2 లక్షల కోట్లకుపైగా నిధులు ఆదా అవుతాయి. ఇక ఇథనాల్ పర్యావరణ పరంగా కూడా మేలు చేస్తోంది. ఇథనాల్ స్టవ్‌ల నుంచి పొగ రాదు. దీని వల్ల పర్యావరణానికి హాని కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్పీజీ కొరత క్రమంలో ఈ ప్రత్యామ్నాయ వంట మార్గంపై జోరుగా చర్చ జరుగుతోంది. భారత్‌కు ఎల్పీజీ దిగుమతి చేసుకునే ఖర్చుతో పాటు సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది. దీని వల్ల డబ్బులు పొదుపు అవుతాయి. భారత్ వేగంగా దీని వైపు దృష్టి మళ్లించాలని సూచిస్తున్నారు.
