Small Cap Funds: మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

ఈ మధ్య మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే మ్యూచువల్ ఫండ్లు రిస్క్​తో కూడుకున్న విషయం.

Small Cap Funds: మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
Mutual Fund
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 24, 2022 | 10:21 PM

ఈ మధ్య మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే మ్యూచువల్ ఫండ్లు రిస్క్​తో కూడుకున్న విషయం. అందుకే మ్యూచువల్‌ ఫండ్లలో మ‌దుపు చేసే వారు త‌మ‌ న‌ష్టభ‌యాన్ని అనుస‌రించి ఫండ్లను ఎంపిక చేసుకోవడం మంచిది. న‌ష్టభయం ఉన్నప్పటికీ వృద్ధిని కోరుకునే వారు ఈక్విటీ ఫండ్లలో(equit funds)మదుపు చేయవచ్చు. ఈక్విటీ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. లార్జ్‌క్యాప్(Largecap), మిడ్​క్యాప్(midcap), స్మాల్​క్యాప్(smallcap) ఉంటాయి లార్జ్​క్యాప్ ఫండ్లలో కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్లలో నష్టభయం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే వీటిల్లో రాబ‌డి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉండొచ్చు.రూ.5,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న కంపెనీల స్టాక్‌లను స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు తమ దగ్గర ఉన్న నిధుల్లో 65 శాతం నిధుల‌ను స్మాల్‌ క్యాప్​కు చెందిన కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేయడానికే కేటాయించాలి. మిగిలిన 35 శాతం సొమ్ముతో ఇతర విభాగాలకు చెందిన షేర్లు, రుణపత్రాలు కొనుగోలు చేయొచ్చు.

కంపెనీలు చిన్నగా తమ ప్రయాణాన్ని ప్రారంభించి క్రమేణా పెద్ద కంపెనీలుగా అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి కంపెనీలను గుర్తించి పెట్టుబడి పెట్టే అవకాశం స్మాల్‌ క్యాప్‌ ఫండ్లకు ఉంటుంది. అది కూడా ఫండ్‌ మేనేజర్ సామ‌ర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలు వ‌చ్చే అవకాశం ఉంటుంది. ఒక‌వేళ ఫండ్‌ మేనేజర్‌ అంచనాలు తప్పయినా, మార్కెట్లు భారీగా నష్టపోవాల్సి వచ్చినా స్మాల్‌ క్యాప్‌ ఫండ్ల విలువ వేగంగా త‌గ్గిపోతుంది. మళ్లీ కోలుకోవటానికి చాలా సమయం పట్టొచ్చు. అందుకే ఈ త‌ర‌హా ఫండ్లను ఎంచుకునే ముందు కొన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి.

స్మాల్ క్యాప్ ఫండ్లు స్వల్పకాలంలో వ్యాపారంలో వృద్ధి క‌న‌బరిచిన చిన్న కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబ‌డులు పెడుతుంటాయి. ఇవి ఎంత వేగంగా వృద్ది చెందుతాయో.. అంతే వేగంగా ప‌త‌నం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు నిష్క్రమించాలో తెలిసిన పెట్టుబ‌డిదారుల‌కు మాత్రమే ఇవి స‌రిపోతాయి. స్మాల్ క్యాప్ సూచీ బాగా ప‌త‌న‌మైంది కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌దుపుచేస్తే రాబ‌డి క‌చ్చితంగా వ‌స్తుంద‌ని అనుకోవ‌ద్దు. వీటికి న‌ష్టభయం అధికంగా ఉంటుంది. అందుకే ఫండ్లను ఎంచుకునే ముందు మ‌దుప‌ర్లు త‌మ న‌ష్టభ‌యాన్ని అంచ‌నా వేసుకోవాలి.

పెట్టుబడి కోసం ఎంచుకున్న ఫండ్ల పనితీరును నిరంతరం సమీక్షించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు కొన్ని నిష్పత్తులు చూడడం మంచిది. బీటా నిష్పత్తి ఒకటి కంటే తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉన్నట్టు అర్థం. అలాగే, ఆల్ఫా రేషియో ఎంత ఎక్కువగా ఉంటే అంత రాబడి అందించగలదని అర్థం. స్మాల్​క్యాప్ ఫండ్లలో ఒకేసారి పెట్టుబడి పెడితే ‘టైమింగ్‌ రిస్కు’ను ఎదుర్కొనాల్సి వస్తుంది. క్రమంగా పెట్టుబడి (సిప్‌) అనుసరించి నెలసరి వాయిదాల పద్ధతిలో పెట్టుబడులు పెడితే రిస్క్‌ తగ్గిపోవటంతో పాటు, అధిక లాభాలు గడించటానికి ఛాన్స్ ఉంటుంది.

Read Also.. Stock Markets: కుప్పకూలిన మండే మార్కెట్లు.. రూ. 20 లక్షల కోట్లు ఆవిరి.. కోలకునేది ఎప్పుడంటే..