Car offers: రండి బాబూ రండి.. కారు కొనండి.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలు
రండి బాబూ రండి.. కారు కొనండి అంటూ కార్ల తయారీ కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. ఇందుకోసం కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపు ధరలను అందజేస్తున్నాయి. విక్రయాలను పెంచుకునే చర్యలలో భాగంగా భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటారు ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) సూపర్ డిలైట్ మార్చ్ అనే ప్రచారం ప్రారంభించింది. తన ఎక్స్‌టర్, ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లపై రూ.35 వేల నుంచి రూ.55 వేల వరకూ డిస్కౌంట్ అందజేస్తోంది. దీనిలో ధరల తగ్గింపు, ఉచితాలు కలిసి ఉంటాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో కార్ల మార్కెట్ ఆశాజనకంగా లేదు. దాదాపు అన్ని కంపెనీ వాహనాల విక్రయాలు తగ్గిపోయాయి. గతేడాదితో పోల్చితే 2025 ఫిబ్రవరిలో వాహనాల అమ్మకాలు దాదాపు 7.19 శాతం తగ్గిపోయాయి. ఇక ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 10.34 శాతం తగ్గుదలను చవిచూశాయి. ప్రధానంగా హ్యుందాయ్ కంపెనీ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 38,156 యూనిట్ల విక్రయంతో దేశ కార్ల మార్కెట్‌లో నాలుగో స్థానానికి పడిపోయింది. మారుతీ సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తర్వాత స్థానంలో నిలిచింది. జనవరిలో జరిగిన 59,858 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే దాదాపు 36 శాతం భారీ తగ్గుదల అని చెప్పవచ్చు.
సూపర్ డిలైట్ మార్చ్ ద్వారా హ్యుందాయ్ తన కార్లపై భారీ తగ్గింపులు అందజేస్తోంది. హ్యుందాయ్ వెన్యూపై రూ.55 వేలు, ఎక్స్ టర్ పై రూ.35 వేలు, ఐ20పై రూ.50 వేలు, గ్రాండ్ ఐ10 నియోస్ పై రూ.53 వేల తగ్గింపు అందజేస్తోంది. హ్యుందాయ్ సీవోవో తరుణ్ గార్గ్ మాట్లాడుతూ ఈ ఆఫర్ల ద్వారా హ్యుందాయ్ కార్లను తక్కువ ధరకు కస్టమర్లు సొంతం చేసుకోవచ్చన్నారు. వీటిని కేవలం డిస్కౌంట్ గా కాకుండా ఒక పండగలా చూడాలన్నారు. మార్కెట్ లో తగ్గిన తన స్థానాన్ని పెంచుకోవడానికి హ్యుందాయ్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ డిస్కౌంట్లు ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ దాదాపు ఐదు నెలలుగా క్షీణించింది. దీంతో కార్ల కొనుగోలు వంటి పెద్ద ఖర్చులకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు డీలర్ స్టాక్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. త్వరలో హోలీ, గుడి పద్వా వంటి పండగలు రానున్నాయి. దీంతో కార్ల విక్రయాలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు.
ఎఫ్ఏడీఏ చేసిన సర్వే ప్రకారం సుమారు 45 శాతం డీలర్లు ఈ పండగల్లో కార్ల విక్రయాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. హ్యుందాయ్ తో పాటు పలు కంపెనీలు కూడా తమ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించాయి. స్కోడా ఆటో ఇండియా తన కుషాక్, స్లావియా, కైలాక్ మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది. ఒక ఏడాదది నిర్వమణ ప్యాకేజీ, పొడిగింపు వారెంటీలను తెచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..