Small finance banks: ఎఫ్‌డీలపై అధిక వడ్డీరేటు కావాలా..? ఆ బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు
వివిధ బ్యాంకులలో అమలువుతున్న ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతారు. ఎలాంటి రిస్క్ లేకుండా నిర్ణీత కాలానికి వడ్డీని అందించే ఆ పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. సీనియర్ సిటిజన్లతో పాటు సాధారణ ఖాతాదారులు సైతం వీటిలో పెట్టుబడి పెడతారు. అయితే ఎఫ్ డీలపై అందించే వడ్డీరేటును గమనించుకోవడం చాలా అవసరం.

ఇటీవల రిజర్వ్ బ్యాంకు రెపోరేటును తగ్గించింది. దానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ రుణాలపై వడ్డీలను కుదించాయి. దానితో పాటు ఎఫ్ డీలపై వడ్డీరేట్లు కూడా తగ్గిపోయాయి. కానీ కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎఫ్ఎఫ్ బీ) మాత్రం ఏడాదికి 9 శాతం వరకూ వడ్డీరేటును అమలు చేస్తున్నాయి. వాటి వివరాలు, వడ్డీరేట్లను తెలుసుకుందాం. పేద, తక్కువ వర్గాల ప్రజలకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు(ఎస్ఎఫ్ బీ) ప్రధాన కర్తవ్యం. అందుకోసం రిజర్వ్ బ్యాంకు వీటిని ఏర్పాటు చేసింది. చిన్న పరిశ్రమలు, చిన్న సన్నకారు రైతులు, చిన్న వ్యాపార యూనిట్లు, అసంఘటిత రంగంలో పనిచేేసే వారు వీటి ద్వారా సేవలు పొందుతారు. ఎస్ఎఫ్ బీలు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను అమలు చేస్తున్నాయి. ఏడాది కాలపరిమితికి ఎఫ్ డీలపై అత్యధిక వడ్డీరేటు అందిస్తున్నాయి.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఎఫ్ డీలపై అత్యధిక వడ్డీరేటు అమలవుతోంది. యూనిటీ బ్యాంకులో 1001 రోజులకు ఏడాదికి 9 శాతం వడ్డీరేటు ఉంది. మామూలుగా ఏడాదికి 7.85 శాతం అందజేస్తోంది. నార్త్ ఈస్ట్ బ్యాంకులో 18 నెలల ఒక్క రోజు నుంచి 36 నెలల కాలపరిమితికి 9 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది స్థిర డిపాజిట్లపై 7 శాతం ఇస్తున్నారు.
- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఐదేళ్ల కాలపరిమితికి ఏడాది 8.6 శాతం, ఏడాదికి అయితే 8.25 శాతం వడ్డీ అందిస్తున్నారు.
- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 2 నుంచి 3 సంవత్సరాలు లేదా 1500 రోజుల డిపాజిట్లకు ఏడాదికి 8.5 శాతం వడ్డీ ఉంటుంది. ఇక ఏడాదికి 8 శాతం అమలు చేస్తున్నారు.
- ఈఎస్ఏఎఫ్ బ్యాంకులో 888 రోజులకు అత్యధికంగా 8.38 శాతం వడ్డీని అందిస్తారు. కానీ ఏడాదికి అయితే 6 శాతం ఉంటుంది.
- ఈక్విటాస్ బ్యాంకులో 888 రోజులకు 8.25 శాతం, ఏడాదికి 8.1 శాతం వడ్డీని అమలు చేస్తున్నారు.
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఏడాది నుంచి మూడేళ్లకు 8.25 శాతం ఇస్తారు.
- ఉజ్జీవవన్ బ్యాంకులో 18 నెలలకు 8.25 శాతం, ఏడాదికి డిపాజిట్లకు 8.1 శాతం అమలవుతుంది.
దేశంలోని ఇతర బ్యాంకుల మాదిరిగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు నియంత్రిస్తుంది. కాబట్టి సురక్షితంగానే ఉంటాయని చెప్పవచ్చు. అలాగే డిపాజిట్ ఇన్స్యూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..