Money deadlines: మార్చిలో ఆ పనులు మర్చిపోయారో ఇక అంతే సంగతులు.. భారీ నష్టం తప్పదంతే..!
మనిషి ఉన్నత స్థానానికి వెళ్లడానికి ఆర్థిక క్రమశిక్షణ చాలా కీలకంగా ఉంటుంది. డబ్బులకు సంబంధించిన వ్యవహారాలను సమయానికి నిర్వహించినప్పుడు నష్టపోయే అవకాశం ఉండదు. మీరు డబ్బులు ఇవ్వాలన్నా, వసూలు చేయాలన్నా ఇదే పద్ధతిని పాటించాలి. ప్రస్తుతం జరుగుతున్నఆర్థిక సంవత్సవం ఈ మార్చితో ముగుస్తుంది. ఏప్రిల్ నుంచి కొత్త ఏడాది మొదలవుతుంది. కాబట్టి పెండింగ్ పనులను ఈ నెలలోనే పూర్తి చేయాలి. ముఖ్యంగా ఆదాయపు రిటర్న్, యూఏఎన్ యాక్టివేషన్ తదితర వాటికి ఈ నెల 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో పూర్తి చేయాల్సిన ఐదు రకాల పనులను తెలుసుకుందాం.

పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను చెల్లించే వారందరూ సెక్షన్ 80సీ, 80డీ, 80జీ కింద పన్ను ఆదా చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ లోపు పెట్టుబడులు పెట్టవచ్చు. జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్ పీఎస్), ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), పన్ను ఆదా చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఐదేళ్ల లాక్ ఇన్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ల ద్వారా తగ్గింపులు పొందవచ్చు.
ఐటీఆర్ దాఖలు
ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు కొన్నిపొరపాట్లు జరగవచ్చు. వాటిని సరిదిద్దుకుని ఐటీఆర్ – యు (నవీకరించిన ఐటీఆర్)ను అందజేయవచ్చు. మీ ఐటీఆర్-యును దాఖలు చేయడానికి సంబంధింత అసెస్మెంట్ సంవత్సరం ముగింపు నుంచి రెండు సంవత్సరాల సమయం ఉంది. అలాంటి వారు ఎవరైనా మార్చి 31లోపు ఐటీఆర్-యు అందజేయాలి.
యూఏఎన్ యాక్టివేషన్
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉన్న వారందరూ తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఎన్ఎన్) ను యాక్టివేట్ చేసుకోవాలి. దీని ద్వారా ఆన్ లైన్ లో ఖాతాను నిర్వహించుకోవడానికి వీలు కలుగుతుంది. దీనిలో సభ్యులకు ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం ద్వారా రూ.7 లక్షల వరకూ బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ ప్రయోజనాలు పొందాలంటే మార్చి 15లోపు యూఏఎన్ నంబర్ ను యాక్టివేట్ చేసుకోవాలి.
ఎస్ బీఐ పథకాలు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు అమృత్ వృష్టి అనే 444 రోజుల ప్రత్యేక కాలపరిమితి పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా ఖాతాదారులకు 7.25 శాతం వరకూ వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల 7.75 శాతం పొందవచ్చు. అయితే ఈ పథకం మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. ఆసక్తి కలవారు ఆలోపు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే అమృత్ కలాష్ అనే మరో 400 రోజుల డిపాజిట్ పథకంపై 7.10 శాతం వడ్డీని అమలు చేస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.60 శాతం పొందవచ్చు.
ఐడీబీఐ, ఇండియన్ బ్యాంకుల ఎఫ్ డీలు
- ఐడీబీఐ బ్యాంకులో ఉత్సవ్ కాల్లబుల్ ఎఫ్ డీ పథకం అమలవుతుంది. దీనిలో మెచ్యూరిటీ వ్యవధిని బట్టి వడ్డీరేట్లు మారుతూ ఉంటాయి. దీనిలో పెట్టుబడి పెట్టడానికి మార్చి 31 చివరి తేదీ.
- ఇండియన్ బ్యాంకులో ఐఎన్ డీ సుప్రీం 300 డేస్, ఐఎన్ డీ 400 డేస్ పేరుతో ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు అమలవుతున్నాయి. వీటిలో సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వరకూ వడ్డీ లభిస్తుంది. వీటిలో పెట్టుబడి పెట్టడానికి మార్చి 31 వరకూ మాత్రమే గడువు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..