Ultraviolette EVs: వీటిని కొని పెట్రోలు ఖర్చుకు టాటా చెప్పేయ్యండి.. బెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే..!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ కు కొత్త మోడళ్లు పోటెత్తుతున్నాయి. ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు. ప్రముఖ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా మార్కెట్ లో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ను టెస్సెరాక్ట్‌ను, అలాగే తొలి ఎండ్యూరో బైక్ షాక్ వేవ్‌ను ఆవిష్కరించింది. వీటి ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ అయిన అల్ట్రావయొలెట్ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ లను విడుదల చేస్తుంది. ఈ విభాగంలో తన మార్కెట్ ను పెంచుకునే దిశగా తొలిసారిగా టెస్సెరాక్ట్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. దీని ద్వారా అథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలకు పోటీ ఇస్తోంది. కాగా.. కొత్త స్కూటర్‌ను డైనమిక్ రీజెన్ సిస్టమ్ తో తీసుకువచ్చారు. దీనిలో 6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాక్ అమర్చారు. దీన్ని పూర్తిగా రీచార్జి చేస్తే సుమారు 261 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ స్కూటర్‌ను మొదటి పదివేల మంది కొనుగోలుదారులకు రూ.1.20 లక్షలకు అందజేస్తారు. తదుపరి 50 వేల మందికి రూ.1.30 లక్షల చొప్పున విక్రయిస్తారు. అనంతరం దీని ధరను రూ.1.45 లక్షలుగా నిర్ధారిస్తారు. అదే తుది ధర అవుతుంది. గంటకు గరిష్టంగా 125 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టే ఈ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.
పాక్ వేవ్ బైక్
అల్ట్రావయొలెట్ కంపెనీ మొదటి రోడ్ లీగల్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో మోటారు సైకిల్ అయిన షాక్ వేర్ ను కూడా విడుదల చేసింది. 4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ బైక్ సుమారు 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ముఖ్యంగా అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం దీన్ని విడుదల చేశారు. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. కేవలం 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.
ఈ బైక్‌ను మొదటి వెయ్యిమంది కొనుగోలు దారులకు రూ.1.50 లక్షలు అందజేస్తారు. ఆ తర్వాత కొనుగోలు చేసేవారు మాత్రం రూ.1.75 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, వైర్ స్పోక్ వీల్స్, డ్యూయల్ పర్పస్ టైర్లు ఆకట్టుకుంటున్నాయి. అన్ని రకాల ప్రదేశాల్లో రైడింగ్ చేయవచ్చు. స్పిచబుల్ డ్యూయల్ చానల్ ఏబీఎస్, నాలుగు ట్రాక‌్షన్ కంట్రోల్ మోడ్ లు, ఆరు లెవెల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ తదితర అధునాత ఫీచర్లు కూడా అమర్చారు. కాగా.. టాస్సెరాక్ట్, షాక్ వేవ్ ఈవీల డెలివరీలు 2026 మొదటిలో ప్రారంభమవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..